గురువారం 04 జూన్ 2020
National - May 22, 2020 , 17:33:22

విధి వక్రించినా కుంగిపోలేదు.. అంగవైకల్యాన్ని జయించాడు

విధి వక్రించినా కుంగిపోలేదు.. అంగవైకల్యాన్ని జయించాడు

వడోదర: పాఠశాల రోజుల్లో చాలా మంది విద్యార్థులు చదువును భారంగా భావిస్తుంటారు. చిన్నచిన్న కారణాలు చెప్పి బడి ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తారు. రాయమంటే వేలు నొప్పి, చదువమంటే తలనొప్పి అని సాకులు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొందరు విద్యార్థులు మాత్రం చదువే ప్రాణం అన్నట్టుగా ఉంటారు. ఎలాంటి సమస్యలనైనా అధిగమించి చదువుకునేందుకు ప్రాముఖ్యం ఇస్తారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన శివం సోలంకి అనే బాలుడు కూడా ఈ కోవకు చెందినవాడే. 

శివం సోలంకి 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు విధి వక్రించింది. విద్యుత్‌షాక్‌ తగిలి అతను రెండు చేతులు, ఒక కాలు కోల్పోయాడు. అయినా సోలంకి ఏ మాత్రం కుంగిపోలేదు. గాయాలు మానడమే ఆలస్యం చదువు కొనసాగించాడు. అంతేకాదు ప్రతి తరగతిలో ప్రతిభ చూపుతూ ముందుకుసాగాడు. తాజాగా ఇంటర్మీడియట్‌లో 92.33 శాతం మార్కులు సాధించి తన సత్తా చాటాడు. 

భవిష్యత్తులో తాను డాక్టర్ అయ్యి తన లాంటి వారికి సేవ చేయాలనుకుంటున్నానని సోలంకి చెప్పాడు. ఒకవేళ డాక్టర్‌ కావడం సాధ్యం కాకపోతే ప్రజాసేవ చేసే అవకాశం ఉన్న మరో రంగంలో ప్రవేశించి ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పాడు. తాను అంగవైకల్యాన్ని జయించి విద్యలో రాణించడంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారని శివమ్‌ సోలంకి చెప్పాడు. 


logo