‘శివానందు మావురాల ఎల్లమ్మా.. నువ్వు సిద్దులాకు సెల్లెలావె ఎల్లమ్మా..
పార్వాతికాడిబిడ్డె ఎల్లమ్మా… పర్శరామయాను గన్న తల్లి ఎల్లమ్మా..
శివునికి సిన్నాడిబిడ్డె ఎల్లమ్మా.. నువ్వు సిత్రమైన దేవతావు ఎల్లమ్మా..
గౌతూని కోడలావు ఎల్లమ్మా.. నువ్వు గౌండ్లింటి ఆడబాల ఎల్లమ్మా..’
ఇట్లా.. రాత్రంతా సాగుతది ఎల్లవ్వ తల్లి చరిత్ర. ఈ కథ చెప్పడానికి మా వెల్దేవి నుంచి నలుగురైదుగురం బైండ్లోళ్లం గల్సి అడ్డగూడూరు మండలం మీదికెల్లి మోత్కూరు, ధర్మారం ఇట్లా.. పాత నల్గొండ జిల్లా మొత్తం ఏ ఊరికంటే ఆ ఊరికి వోతం. ఒక్క ఎల్లవ్వ తల్లి కథనే గాదు, దుర్గవ్వ కొలుపు, మైసవ్వ కొలుపు.. పండుగలను వట్టి ఏ కొలుపంటే ఆ కొలుపు కొలుస్తం. కథల్ జెప్తెనే మా కడుపు నిండుతది. అయినా కథల్ జెప్పుడు ఎప్పుడుంటదా? పండుగకో, పబ్బానికో. మా కడుపుకు లేకున్నా మంచిదేగని పోరగాండ్లు ఒర్రిసావద్దు గదా అని కథల్ లేనప్పుడు సుజాతతో గల్సి ఇద్దరాలుమొగలం కూలో, నాలో చేసుకబతుకుతం. తిండికే తిప్పలుంటదిరా నాయినా అంటే.. ఈ సదువొక్కటి. సదువంటే గుర్తుకొచ్చింది. మేం ఏ కథ మొదలువెట్టినా ముందుగాల..
‘తల్లీ నిన్నుదలంచి పుస్తకం చేతను బూనితిని
నీవు నా ఉల్లంబందు శోభిల్లవై శారదాదేవి నీకే మొక్కెదము’
జెప్పేది ఈ శారద దేవి కథనే.. అవును సదువు గురించి ఎందుకో అచ్చె. హా… మాకు కొడుకు నరేందర్, బిడ్డె భార్గవి. బిడ్డె పెద్దది. ఇద్దర్నీ ఇంగ్లిష్ మీడియంల సదివిపించాల్ననే మాకుండేది. గనీ ఆ ప్రైవేటు స్కూళ్లల్ల ఫీజులు గట్టుడు మాతోనైతదా? అందుకే ఆడబాల అంటే ఒగింటికి వోయెటామెనే గదా? అని సర్కారు బల్లె సద్విపిచ్చిన. ‘అగ్గో.. గా బైండ్ల జగన్ గాడు జూసినవా.. కొడుకు నరేందర్ గాన్ని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియంల ఏసిండట, బిడ్డె భార్గవిని సర్కారు బల్లె తెలుగు మీడియం సదివిపిస్తుండట’ అని నల్గురు నాల్గు రకాలుగా పేర్నాల వెట్టిర్రు. మందిమాటలు వట్టుకొని మార్వానం బోతె మళ్లచ్చేసరికి ఇల్లు గాలి బూడిదైందట శాత్రం గుర్తుకొచ్చింది. అందుకే ఎవ్వలేమనుకుంటే నాకేంది, నా ఎల్లువాను తీరు బిడ్డెనేమో డైరెక్టు ప్రభుత్వ బల్లె ఒక్కటో తరగతిల షరీఖ్ జేసిన. కొడుకును ప్రైవేటు స్కూళ్లేస్తే.. వాడు ఎల్కేజీ, యూకేజీ అనుకుంటా.. వయసు కొంచెం చిన్నా పెద్దా అయినా సదువుల మాత్రం సమానమైర్రు.
2015 అనుకుంటా.. ధర్మారం కాపోళ్లింటికాడ ఓ రాత్రంతా దుర్గవ్వ కొలుపు గొల్సి తెల్లారి పదింటికి ఇంటిమొకాన అచ్చిన.. ఇంటికొచ్చేసరికి కొడుకు నరిగాడు మా గూనెపెంకల ఇంట్ల ఓ మూలకు నత్కి గుక్కతిప్పకుంటా ఒక్కటే మొకానేడుస్తున్నడు. ‘అగ్గో ఏమైందిరా నరిగా.. ఎందుకో ఏడుస్తున్నవ్’ అని దగ్గర్కివోయిన. పోరడు కడుపుల తలికాయ వెట్టి ఒక్కటే మొకాన ఏడ్సుకుంటా జెప్పవట్టిండు. స్కూల్ ఫీజు కట్టలేదని వ్యాన్ల ఎక్కించుకోలేదట వ్యాన్ క్లీనర్. దోస్తుల ముందట ఇజ్జతంతా వోయింది. రేపు వాళ్లకేం చెప్పాల్నని వాని బాధ. ఇగ లాభం లేదని అప్పటిమందం అప్పుదెచ్చి స్కూల్ ఫీజు గట్టిన.
ఇప్పటిదాన్క ఎట్లనో ఎల్లింది. ఇగ నరిగాన్ని ప్రైవేటు స్కూళ్ల సద్విపిచ్చుడు నాతోని గాదని సర్కారు బల్లెకే తోల్తమనుకున్నం. తెలంగాణొచ్చినంక గురుకులాల బడులు ప్రైవేటు బడుల కంటే మంచిగైనయి. అండ్ల అప్లయి జేస్కోర్రి. సీటొస్తే మీ అంత అదృష్టమంతులెవ్వల్లేరని మా ఇంటికాడి తిరుమలేశ్ జెప్పవట్టిండు. ఆయ్న కొంచెం సద్వుకున్నోడు, తెల్విగల్లోడు. ఆయ్న ఎట్ల చెప్తే గట్లనే ఇన్నం. గురుకులాల బడుల్లో సీట్ల కోసం మా అడ్డగూడూరు మీ-సేవల అప్లయి జేసినం.
ఆ శివుని శిన్నాడిబిడ్డె మా యందున ఉన్నది. అందుకే ఇద్దరికీ గురుకులాల సీట్లొచ్చినయి. వలిగొండల భార్గవి, మోత్కూర్ల నరేందర్ పదోతరగతి దాన్క సద్వుకున్నరు. మొన్న 2022ల బిడ్డె భార్గవికి 93 మార్కులొస్తే, కొడుకు నరేందర్‌కు 85 మార్కులొచ్చినయి. ఇగ ఇంటర్మీడియెట్ గూడ గురుకులాలళ్లనే సద్వుకుంటరు. భార్గవికి కన్నారంల సీటొచ్చింది. కొడుక్కు ఇంక ఎక్కణ్నో తెల్వది.
నిజంగా.. వాళ్ల ఐదో తరగతి నుంచి ఇప్పటిదాన్క నా చేతిగుంట ఒక్కపైస వెట్టలే. తెలంగాణ సర్కారే కొత్త బట్టలిచ్చింది. కొత్త పుస్తకాలిచ్చింది. వాళ్లను సూడబుద్దయితే మేమే ప్రతి నెల రెండో శనివారం గురుకులాల బడికి వోయేటోళ్లం. నా కొడుకు నరేందర్‌ను, నా బిడ్డె భార్గవిని జూత్తే మాకు అన్నం దిన్నంత బరాబరైతుండె. అన్నం అంటే గుర్తుకొచ్చింది మా ఇంటికాడనన్న వాళ్లకు కడుపు నిండా పెట్టినమో లేదో గని తెలంగాణ సర్కార్ మాత్రం వాళ్లకు కడుపు నిండా అన్నం బెట్టింది. మంచి మంచి కూరలు, ఐతారం ఐతారం కౌసు కూర కాన్నించి వెట్టింది. సర్దో, దగ్గో, జ్వరమో అస్తే గురుకులాల సార్లే కన్న బిడ్డల్లెక్క సూస్కునేది.
దసరా సెలవులకో, సంక్రాంతి పండుక్కో నా బిడ్డె భార్గవి ఇంటికొచ్చినప్పుడు ఇంగ్లిషుల్నే మాట్లాడుతది. ఆమె ఇంగ్లిష్ మాకు అర్థం గాదు గని, నాడు పేర్నాల వెట్టిన నోళ్లే ఇయ్యాళ్ల నా బిడ్డను పొగుడుతా ఉంటే సంబురమైతది. ఏ తల్లిదండ్రికైనా ఇంతకన్నా ఇంకేం గావాలి? నా కొడుకు, బిడ్డె ఇట్లనే మంచిగ సదువుకొని మంచి పేరు తెచ్చుకుంటే సాలు. మాకదే పది వేలు.
– గడ్డం సతీష్, 99590 59041