ఆదివారం 24 జనవరి 2021
National - Nov 24, 2020 , 00:51:36

కరోనా కట్టడిలో గుజరాత్‌ ఫెయిల్‌

కరోనా కట్టడిలో గుజరాత్‌ ఫెయిల్‌

ప్రజలు చస్తుంటే.. వేడుకలకు అనుమతులా?: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, నవంబర్‌ 23: దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. గత కొంతకాలంగా పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. కాగా ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో కూడా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు సగటున 1,500 కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ కట్టడిలో స్థానిక యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరస్‌ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటాన్ని ఆక్షేపించింది. ఒకవైపు రాష్ట్రంలో కేసులు పెరుగుతుంటే, ఎక్కువ మంది అతిథులతో వేడుకలు జరుపుకునేలా అనుమతులు ఎలా ఇవ్వాలనిపించిందని తీవ్ర స్వరంతో మండిపడింది. వైరస్‌ కట్టడికి చేపట్టిన చర్యలను తెలుపుతూ రెండు రోజుల్లో నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. గుజరాత్‌తో పాటు మిగతా రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం కూడా వైరస్‌ పరిస్థితులపై నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషన్‌, జస్టిస్‌లు ఆర్‌ఎస్‌ రెడ్డి, ఎమ్మార్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతుండటంపై ధర్మాసనంఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో వైరస్‌ వ్యాప్తి, రోగులకు చికిత్స, కరోనాతో మరణించిన వారి మృతదేహాలను భద్రపరుస్తున్న తీరుపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

ఆ రాష్ట్రంలో పరిస్థితులు చేజారాయి

కరోనా సోకి ఒకవైపు మనుషులు చస్తుంటే, వివాహాది శుభకార్యాలకు గుజరాత్‌ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులనిచ్చింది. వేడుకలకు హాజరయ్యేవారి సంఖ్యను 50 నుంచి 200కు పెంచుతూ నవంబర్‌ 2న మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అక్టోబర్‌ చివర్లో రోజుకు రాష్ట్రంలో సగటున 800 కేసులు నమోదయ్యే పరిస్థితుల నుంచి.. ప్రస్తుతం రోజుకు సగటున 1,500 కేసులు నమోదవుతున్నాయి. దీంతో సర్కార్‌ చర్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లోనే కేసుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నదని, ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పిందని మండిపడింది. నవంబర్‌లో ఢిల్లీలో వైరస్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. 


logo