మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 22:12:37

ఎల్‌జేపీ, బీజేపీ, జేడీయూల మధ్య పెరుగుతున్న విబేధాలు

ఎల్‌జేపీ, బీజేపీ, జేడీయూల మధ్య పెరుగుతున్న విబేధాలు

పాట్నా: బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ), మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ),జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ల మధ్య విబేధాలు పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ వైఖరి కారణంగా నలుగురు ఎల్‌జేపీ ఎంపీలు పార్టీ మారేందుకు చూస్తున్నట్లుగా సమాచారం. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం  చేసుకున్నట్లుగా తెలుస్తున్నది.

ఆరోగ్య సమస్యలతో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దాంతో పార్టీకి  సంబంధించిన అన్ని పనులు చిరాగ్‌ పాశ్వాన్‌ కనుసన్నల్లో జరుగుతున్నాయి. తమను సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఎల్‌జేపీ సీనియర్లు, ఎంపీలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. దాంతో ఎల్‌జేపీ శ్రేణులలో భారీ తిరుగుబాటు పరిస్థితులు తలెత్తనున్నాయి. చిరాగ్‌ పాశ్వాన్‌పై కోపంతో నలుగురు ఎంపీలు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ మొత్తం 243 స్థానాలకుగాను 141 సీట్ల నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే బీజేపీ, జేడీయూ రెండూ ఆయన డిమాండ్‌కు ఒప్పుకునేట్లుగా లేరు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ వరుసగా 157, 101 స్థానాల నుండి పోటీ చేయగా, ఎల్‌జేపీ కేవలం 42 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.

బిహార్‌లో మరోసారి ఎన్డీఏదే ప్రభుత్వం: ఆర్ఎస్ ప్రసాద్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ నమ్మదగిన రీతిలో విజయం సాధించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. "మాకు భవిష్యత్‌ కోసం ఒక దృష్టి ఉంది. బిహార్ ప్రజలకు ఇది తెలుసు. మరింత అభివృద్ధి కోసం మళ్ళీ మాకు ఓటు వేస్తారు. మేము బిహార్లో వర్చువల్ ర్యాలీలు చేశాం. చాలా విజయవంతమయ్యాం. అది మాకు సంతోషంగా ఉంది. ఈ ప్రచారంలో కొన్ని పార్టీలు విఫలమైనప్పటికీ మమ్మల్ని ఇతర రాజకీయ పార్టీలు అనుసరించాయి" అని ఆయన తెలిపారు. మాకు స్పష్టమైన విధానం, స్పష్టమైన దృష్టి, సీఎం పదవికి వ్యక్తి ఉన్నప్పటికీ, మహా గట్భంధన్లో సీఎం అభ్యర్థిపై స్పష్టత లేదని, కూటమి భాగస్వాములు విడిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.


logo