బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 16:59:32

హైదరాబాద్‌లో సెల్ఫ్ స్టోరేజ్ సెంటర్లకు పెరుగుతున్న గిరాకీ

 హైదరాబాద్‌లో సెల్ఫ్ స్టోరేజ్ సెంటర్లకు పెరుగుతున్న గిరాకీ

హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో జనాలు పట్టణాలు, నగరాలూ ఖాళీ చేసి పల్లె బాట పడుతున్నారు. ఐటీ సహా అనేక రంగాలు లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో తమ ఉద్యోగులను పనిచే సేందుకు అవకాశం ఇచ్చాయి. దానిని క్రమంగా పెంచుతూ పోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ వరకు వర్క్ ఫ్రొం హోమ్ పద్ధతిని పొడిగించాయి. మరిన్ని కంపెనీలు మాత్రం వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పద్ధతిని పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు పట్టణాలు, సిటీ లు వదిలి గ్రామాలకు పయనమవుతున్నారు. హైదరాబాద్ వంటి మహా నగరంలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం కూడా ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లిపోవటానికి బలమైన కారణంగా ఉంటున్నది.

 గ్రామాల్లో మెరుగైన వాతావరణం, పచ్చదనం ఉండటంతో అటువైపే మొగ్గు చూపుతున్నారు. పైగా ఇప్పుడు గ్రామాల్లో కూడా మొబైల్ నెట్వర్క్ మెరుగ్గా ఉంటున్నది. దీంతో మెజారిటీ ఉద్యోగులు పల్లెటూళ్లకు వెళ్లిపోతున్నారు. గ్రామాలకు వెళ్ళటం సరే... కానీ సిటీ ల్లో ఉన్న అద్దె ఇండ్లను ఖాళీ చేయాలా.. లేదంటే వాటికి అలాగే అద్దెలు చెల్లించాలా అన్న సందిగ్ధం చాలా మందిని వెంటాడుతోంది. అయితే కొందరు మాత్రం పూర్తిగా అద్దె ఇండ్లు ఖాళీ చేసి సామాన్లతో పాటే గ్రామాలకు వెళుతుండగా... మరికొందరు మాత్రం వాటిని తాత్కాలికంగా స్టోర్ చేసే వసతుల కోసం వెతుకుతున్నారు. ప్రత్యేకంగా ఇందుకోసమే కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. కరోనా వల్ల దెబ్బతిన్న వ్యాపారాలతో ఖాళీగా ఉన్న స్థలాల్లో తాత్కాలిక స్టోరేజ్ స్పేస్ లను ఏర్పాటు చేస్తున్నాయి కొన్ని సంస్థలు.

అద్దె ఇంటితో పోల్చితే అతి తక్కువ ధరకే వినియోగదారుల ఫర్నిచర్ సహా అన్ని రకాల సామాన్ల ను భద్రపరిచేందుకు సదుపాయాలు కల్పిస్తున్నాయి. వీటిని సెల్ఫ్ స్టోరేజ్ కేంద్రాలుగా పేర్కొంటున్నారు. దీంతో ఇటు వినియోగదారులకు అటు స్టోరేజ్ సేవలు అందించే వారికి ఉభయతారకంగా ఉంటోంది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనారోక్ ఒక ప్రత్యేక నివేదిక రూపొందించింది. అందులో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కరోనా వల్ల దెబ్బతిన్న స్టార్టప్ కంపెనీలు తమ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే జిమ్స్, రెస్టారెంట్స్, ప్లే స్కూల్స్ వంటి అనేక సంస్థలు తాత్కాలికంగా సెల్ఫ్ స్టోరేజ్ సేవలను అందిస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యేకంగా ఈ సేవలు అందించేందుకు యువర్ స్పేస్, సేఫ్ స్టోరేజ్, సెల్ఫ్ స్టోరేజ్, స్టోరేజియన్స్, స్టో నెస్ట్ స్టోరేజ్, ఆరంజ్ సెల్ఫ్ స్టోరేజ్ వంటి కంపెనీలు ఉండనే ఉన్నాయి.

ఈ కాన్సెప్ట్ అమెరికా లో పుట్టింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో చాలా మంది సెల్ఫ్ స్టోరేజ్ సేవలను వినియోగించుకున్నారు. అలాగే ఇది క్రమంగా యూరోప్, జపాన్ తదితర దేశాలకు విస్తరించింది. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఈ ట్రెండ్ ప్రస్తుతం భారత్ లోనూ మొదలైంది. ఇకపై ఇది మరింతగా విస్తృతం అవటం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.సెల్ఫ్ స్టోరేజ్ కేంద్రాల్లో సామాన్ల ను నిల్వ చేసుకోవటం సులువు మాత్రమే కాకుండా చౌక కూడా. ఉదాహరణకు 1 బీహెచ్ కె ఇంటి అద్దె సుమారు 7,000 ఉంటె... అందులో పట్టే మొత్తం సామాన్ల ను స్టోర్ చేసేందుకు రూ 3,000 లోపు ధరకే సెల్ఫ్ స్టోరేజ్ కేంద్రాలు అందుబాటులో ఉంటున్నాయి.

అదే 2 బీహెచ్ కె ఇంటి లో పట్టే సామాన్లకు సుమారు రూ 4,000 అద్దె ఉంటున్నది. కాబట్టి, దాదాపు సగం అద్దె ధరలోనే సెల్ఫ్ స్టోరేజ్ కేంద్రాల సేవలు అందుబాటులో ఉండటం వల్ల ఉద్యోగులు తాత్కాలికంగా తమ సామాన్ల ను అక్కడ స్టోర్ చేసుకుని గ్రామాలకు వెళ్లిపోతున్నారు. మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాక... తిరిగి అద్దె ఇండ్లు తీసుకోవాలనేది ఉద్యోగుల అభిప్రాయంగా ఉంది. ఈ కేంద్రాలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే వంటి మహా నగరాల్లో చాలా పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఇవి కేవలం కరోనా వల్ల ఏర్పడినా... భవిష్యత్ లో ఇవి పూర్తిస్థాయి స్టోరేజ్ కేంద్రాలుగా మారిపోతాయనడంలో సందేహం లేదు.


  

తాజావార్తలు


logo