బుధవారం 15 జూలై 2020
National - Jun 22, 2020 , 20:52:42

ఆస్ప‌త్రిలో నూత‌న దంప‌తుల‌కు ఆశీర్వాదం..

ఆస్ప‌త్రిలో నూత‌న దంప‌తుల‌కు ఆశీర్వాదం..

కోల్ క‌తా : ఆస్ప‌త్రిలో నూత‌న దంప‌తుల‌కు ఆశీర్వాదం.. ఏంట‌ని సందేహం రావొచ్చు. కానీ ఆ నూత‌న జంట‌కు డాక్ట‌ర్లు, న‌ర్సులే ఆశీర్వాదం ఇచ్చారు. 

కోల్ క‌తాకు చెందిన సుప్రియో బెన‌ర్జీ(28).. హౌరా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వాలంటీర్. లాక్ డౌన్ కంటే ముందే అత‌ను ఓ వివాహ వేడుక‌కు హాజ‌రు కాగా, అక్క‌డ ఓ అమ్మాయి త‌న‌కు న‌చ్చింది. దీంతో ఆ యువ‌తిపై మ‌న‌సు పారేసుకున్న.. వాలంటీర్ ఆమెతో స్నేహం చేయ‌డం ప్రారంభించాడు. ఆ స్నేహం కాస్త ప్రేమ‌గా మారింది. ఇదంతా రెండు నెల‌ల కాలంలోనే జ‌రిగింది. పెళ్లి చేసుకోవాల‌ని విష‌యాన్ని త‌మ కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారు. కానీ పెద్ద‌లు వీరి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. 

దీంతో సుప్రియో.. త‌న ప్రియురాలిని జూన్ 2న ఓ ఆల‌యంలో వివాహం చేసుకున్నాడు. మొత్తానికి వీరి ప్రేమ పెళ్లిని ఇరు కుటుంబాలు అంగీక‌రించాయి. ఇక జూన్ 4వ తేదీన రిసెప్ష‌న్ కు ప్లాన్ చేసుకున్నారు. ఈ వేడుక‌లో నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యించారు. 

కానీ అంత‌లోనే భారీ షాక్.. వ‌రుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు పోలీసులు తేల్చారు. 3వ తేదీ రాత్రి 9 గంట‌ల‌కు పోలీసులు.. సుప్రియో ఇంటికి వ‌చ్చి.. అత‌న్ని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. 13వ తేదీన అత‌నికి మ‌ళ్లీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగిటివ్ ఫ‌లితం వ‌చ్చింది. దీంతో అత‌నితో పాటు భార్య‌కు, కుటుంబానికి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగింది.  క‌రోనా పాజిటివ్ తో విందు కార్య‌క్ర‌మం ఆగిపోయింద‌ని తెలుసుకున్న ఆస్ప‌త్రి సిబ్బంది.. ఆ నూత‌న జంట‌కు గుర్తుండిపోయేలా వీడ్కోలు చెప్పింది. కొత్త బట్ట‌లు ధ‌రించిన నూత‌న వ‌ధూవ‌రుల‌ను డాక్ట‌ర్లు, న‌ర్సులు ఆశీర్వ‌దించారు. కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించాల‌ని నూత‌న జంట‌ను ఆశీర్వ‌దించి.. కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. 


logo