శనివారం 11 జూలై 2020
National - Jun 30, 2020 , 13:59:13

కరోనా లక్షణాలతో వరుడు మృతి.. పెండ్లికి హాజరైన 95 మందికి పాజిటివ్‌

కరోనా లక్షణాలతో వరుడు మృతి.. పెండ్లికి హాజరైన 95 మందికి పాజిటివ్‌

పాట్నా: కరోనా లక్షణాలతో వరుడు మరణించగా.. ఆ పెండ్లికి హాజరైన 95 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బీహార్‌ రాజధాని పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలోని పాలిగంజ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. డీహ్‌పాలి గ్రామానికి చెందిన 30 ఏండ్ల వ్యక్తి గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మే 12న ఓ యువతితో అతడికి పెండ్లి జరిగింది. అయితే వివాహానికి ముందే అతడికి కరోనా లక్షణాలున్నాయి. దీన్ని పట్టించుకోని కుటుంబ పెద్దలు పెండ్లి తంతును పూర్తి చేశారు. 

వివాహం అనంతరం రెండు రోజులకు సొంత గ్రామానికి తిరిగివచ్చిన తర్వాత వరుడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు పాట్నాలోని ఎయిమ్స్‌ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. పెండ్లి జరిగిన రెండు రోజుల్లోనే వరుడు మరణించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. అయితే కరోనా నిబంధనలకు విరుద్ధంగా అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ పెండ్లికి హాజరైన వారిలో కొందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌గా జూన్‌ 15న నిర్ధారణ అయ్యింది. అయితే పెండ్లి కుమార్తెకు నెగిటివ్‌గా వచ్చింది. మరోవైపు పెండ్లికి వచ్చిన మరింత మంది బంధువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 95 మందికి పాజిటి‌‌వ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. పెండ్లికి హాజరైన వారి ద్వారా మరింత మందికి వైరస్‌ సోకి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. logo