బుధవారం 15 జూలై 2020
National - Jul 01, 2020 , 07:38:56

పెండ్లికి హాజరైన 111 మందికి కరోనా పాజిటివ్‌

పెండ్లికి హాజరైన 111 మందికి కరోనా పాజిటివ్‌

పట్నా: అతనో ఇంజినీర్‌. పక్కరాష్ట్రంలో పనిచేస్తున్నాడు. ఓ యువతితో పెండ్లి కుదిరింది. వివాహ తేదీ సమీపించడంతో సొంతూరికి వచ్చాడు. అయితే అప్పటికే కరోనా లక్షణాల్లో ఒకటైన విరేచనాలతో బాధపడుతున్నాడు. దీంతో లగ్గమైన తెల్లారే హాస్పిటల్‌లో చనిపోయాడు. అతని పెండ్లికి వచ్చిన చుట్టాల్లో 111 మందికి కరోనా సోకింది. జనాలంతా ఒకదగ్గర గుమికూడితో కరోనా మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతుందనడానికి ఇదో పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.

బీహార్‌లోని పట్నా జిల్లా పాలిగంజ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గుర్‌గావ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి జూన్‌ 15న వివాహం నిశ్చయమైంది. తేదీ దగ్గరపడటంతో నాలుగు రోజుల ముందే సొంతూరుకు చేరుకున్నారు. అయితే అప్పటికే కరోనా లక్షణాల్లో ఒకటైన డయేరియాతో బాధపడుతున్నాడు. జూన్‌ 15న వివాహం జరిగింది. సమస్య తీవ్రమవడంతో అదేరోజు దవాఖానలో చేరాడు. పరిస్థితి విషమించి జూన్‌ 16న మరణించాడు. 

దీంతో ఆ పెండ్లికి హాజరైనవారికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 111 మంది అతిథులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారందరిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జూన్‌ 24 నుంచి 26 వరకు ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేశారు. వివాహాలు, అంతిమ సంస్కారాకు హాజరైన సుమారు 400 మందిని పరీక్షించారు. అందులో 86 మందికి కరోనా సోకిందని తేలింది.

దేశంలో అతితక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ర్టాల్లో బీహార్‌ ఒకటి. రాష్ట్రంలో కరోనా అధికమవుతుండటంతో రోజుకు 15 వేల పరీక్షలు నిర్వహించాలని సీఎం నితీష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బీహార్‌లో ఇప్పటివరకు 9744 కరోనా కేసులు నమోదవగా, 62 మంది బాధితులు మరణించారు.


logo