శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 17:41:53

భారతీయ పరిశ్రమలకు గొప్ప అవకాశం: నితిన్‌ గడ్కరీ

భారతీయ పరిశ్రమలకు గొప్ప అవకాశం: నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనాను ప్రపంచం మొత్తం పక్కన పెట్టేస్తున్నదని, ఇది భారత పరిశ్రమలకు గొప్ప అవకాశమని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్ ఇన్ న్యూ ఇండియా' అనే అంశంపై సోమవారం ఆయన వెబ్‌నార్‌లో ప్రసంగించారు.  'ప్రపంచ ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. చైనాతో సంబంధాల విషయంలో ప్రపంచ దేశాలన్నీ విముఖత చూపుతున్నాయి. కాబట్టి ఇది భారతీయ పరిశ్రమలకు గొప్ప అవకాశం. మేం మరింత నాణ్యత-స్పృహతో ఉంటూ పోటీతత్వం ప్రదర్శిస్తాం. పరిస్థితిని సద్వినియోగం చేసుకోగలం' అని గడ్కరీ వ్యాఖ్యానించారు. 

 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), వ్యవసాయ వృద్ధిరేటు, గ్రామీణ పరిశ్రమ వృద్ధిని పెంచే లక్ష్యంతో కేంద్రసర్కారు ముందుకు సాగుతున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకును పెంచిందని, అయితే క్లియరెన్స్, సర్టిఫికెట్, కాంప్లయన్స్ విధానాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని గడ్కరీ పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలనూ డిజిటలైజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలాగే, వచ్చే ఐదేళ్లలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఆదాయాన్ని లక్ష కోట్లకు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ ఆదాయం ఏడాదికి 28 వేల కోట్లున్నదని తెలిపారు. తాను పూర్తిగా ప్రభుత్వ నిధులపైనే ఆధారపడడం లేదని స్పష్టం చేశారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo