ఆదివారం 12 జూలై 2020
National - May 30, 2020 , 02:09:39

మిడతల దండుతో విమానాలకు ముప్పు

మిడతల దండుతో విమానాలకు ముప్పు

  • డీజీసీఏ హెచ్చరిక.. పలు మార్గదర్శకాలు జారీ
  • -నియంత్రణపై రైతులకు రాష్ర్టాల సూచనలు 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దూసుకొస్తున్న మిడతల దండు వల్ల ల్యాండింగ్‌, టేకాఫ్‌ సందర్భాల్లో విమానాలకు ముప్పు పొంచి ఉన్నదని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) శుక్రవారం హెచ్చరించింది. మిడతలు విస్తరించిన ప్రాంతాల్లో విమానం ఎగిరే, దిగే సమాయాల్లో గాలి వేగాన్ని తెలియజేసే పిటోట్‌ ట్యూబ్‌, ఎయిర్‌ కండీషనింగ్‌ పైపులు, ఇంజిన్‌లోని కొన్ని భాగాలు పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదమున్నదని తెలిపింది. దీనివల్ల గాలి వేగం, విమానం ఎంత ఎత్తులో ఉన్నదో చూపించే పరికరాలు సరిగా పనిచేయక పోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో వీటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పైలట్లు, ఇంజినీర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 

రాష్ర్టాలు అప్రమత్తం..

పాకిస్థాన్‌ నుంచి దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్‌ మొదలు పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీకి విస్త్తరించాయి. దక్షిణాది వైపుగా ఇవి దూసుకొస్తున్నాయి. ఇప్పటికే సుమారు లక్ష హెక్టార్ల మేర పంటలు, తోటలను ఈ రాకాసి మిడతలు నాశనం చేశాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పలు రాష్ర్టాలు వీటి నియంత్రణకు రసాయనాల పిచికారీ వంటి చర్యలు చేపట్టడంతోపాటు రైతులకు సూచనలిస్తున్నాయి. పొగ, డప్పు చప్పుళ్లతో మిడతలను పారదోలాలని మహారాష్ట్రకు చెందిన వ్యవసాయ యూనివర్సిటీ పేర్కొంది.


logo