శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 01:29:46

అగ్రరాజ్యాధిపతికి అపూర్వ స్వాగతం

అగ్రరాజ్యాధిపతికి అపూర్వ స్వాగతం

అహ్మదాబాద్‌: భారత గడ్డపై తొలిసారిగా అడుగిడిన శ్వేత సౌధాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌కి అపూర్వ స్వాగతం లభించింది. తమ రాష్ర్టానికొచ్చిన విశిష్ట అతిథికి గుజరాతీలు నీరాజనాలు పలికా రు. దీంతో తనను చూసేందుకొచ్చిన లక్షల మంది ప్రజల ఆత్మీ య అభిమానానికి మురిసిపోయిన ట్రంప్‌ వారి శుభాకాంక్షల ను చిరునవ్వుతో స్వీకరించారు. 2 రోజుల భారత పర్యటన కో సం సోమవారం అహ్మదాబాద్‌లో సర్దార్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులు తదితరులకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ట్రంప్‌ రాకకు గంట ముందే మోదీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11.40 గంటలకు ట్రంప్‌ రావా ల్సి ఉంది.. కానీ 3 నిమిషాల ముందే (ఉదయం 11.37 గంటలకు) విమానం భారత్‌ చేరుకున్నది. ఆ తర్వాత మోతెరా క్రికెట్‌ మైదానం వరకు జరిగిన రోడ్‌షోలో దాదాపు 50 వేదికలపై ప్రదర్శనలతో శుభాకాంక్షలు తెలిపారు. నమస్తే ట్రంప్‌ కార్యక్రమం జరిగిన మోతెరా స్టేడియానికి జనాలు ఉదయం నుంచే పోటెత్తారు. దాదాపు లక్ష 25వేల మంది హాజరుకాగా.. వీరిలో చాలా మంది తమ ముఖాలకు మోదీ, ట్రంప్‌ చిత్రాలతో కూడిన మాస్క్‌లను ధరించారు. బాలీవుడ్‌ గాయకులు కైలాశ్‌ ఖేర్‌, గుజరాత్‌ గాయకులు కీర్తిదన్‌ గాద్వి, గీతా రబారీ, కింజల్‌ దేవ్‌ పాటలు పాడి సందర్శకులను ఉత్సాహపరిచారు.

‘హమ్‌ భారత్‌ ఆనే కే లియే తత్పర్‌ హై’హిందీలో ట్రంప్‌ ట్వీట్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు వచ్చే మార్గంలో హిందీలో ట్వీట్‌చేశారు.  ‘హమ్‌ భారత్‌ ఆనే కే లియే తత్పర్‌ హై. హమ్‌ రాస్తే మే హై. కుచ్‌ హీ గంటో మే హమ్‌ సబ్సే మిలేంగే (భారత్‌ను సందర్శించేందుకు ఆతృతగా ఉన్నాం. దారిలో ఉన్నాం. కొన్ని గంటల్లో మీ అందరినీ కలుస్తాం)’ అని ఆయన ట్వీట్‌చేశారు. 


logo