ఆదివారం 24 జనవరి 2021
National - Dec 24, 2020 , 19:03:58

మీ సౌలభ్యం మేరకు చర్చలకు రండి.. రైతు నేతలకు కేంద్రం లేఖ

మీ సౌలభ్యం మేరకు చర్చలకు రండి.. రైతు నేతలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: రైతు నేతల సౌలభ్యం మేరకు చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద సుమారు నెల రోజులుగా నిరసనలు చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులకు గురువారం తాజాగా మరో లేఖ రాసింది. ఆరో విడత చర్చల తేదీ, సమయాన్ని రైతు నేతలే నిర్ణయించాలని కోరింది. వ్యవసాయ చట్టాల సవరణలకు బదులుగా ప్రభుత్వం మరో కొత్త ఎజెండాతో ముందుకు వచ్చే వరకు ఎలాంటి చర్చలు జరుపబోమని రైతు సంఘాలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ప్రతిపాదనతో లేఖ రాసింది. ‘ప్రభుత్వం, గౌరవంగా, బహిరంగ మనస్సుతో, అనేక రౌండ్ల చర్చలు జరిపింది. మీ సౌలభ్యం మేరకు తదుపరి రౌండ్ చర్చలు జరుపాలని ప్రతిపాదించింది’ అని అందులో పేర్కొంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగ్రవాల్‌ సంతకంలో కూడిన లేఖను రైతు సంఘాల నేతలకు పంపారు. logo