బుధవారం 03 జూన్ 2020
National - Jan 28, 2020 , 02:47:07

బోడోలతో శాంతి ఒప్పందం

బోడోలతో శాంతి ఒప్పందం
  • సంతకాలు చేసిన ఎన్డీఎఫ్బీ, ఏబీఎస్‌యూ, యూబీపీవో గ్రూపులు
  • జనవరి 30న లొంగిపోనున్న 1,550 మంది తీవ్రవాదులు
  • బోడోలకు రాజకీయ, ఆర్థిక హక్కులు కల్పించడమే ప్రధానోద్దేశం

న్యూఢిల్లీ, జనవరి 27: బోడోలకు ప్రత్యేక రాష్ర్టం/ కేంద్రపాలిత ప్రాంతం కోసం అసోం లో కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులు నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడో ల్యాండ్‌ (ఎన్డీఎఫ్బీ), ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏబీఎస్‌యూ)తో సోమవారం కేంద్రం ఒప్పందం చేసుకుంది. యూనైటెడ్‌ బోడో పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌(యూబీపీవో) కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది. బోడో తెగకు రాజకీయ, ఆర్థిక హక్కు ల కల్పనకు ఉద్దేశించిన ఈ ఒప్పందంలో భాగంగా బోడోల అభివృద్ధికి మూడేండ్లలో రూ. 1,500 కోట్లతో ఆర్థిక ప్రాజెక్టును తేవటంతో పాటు జనవరి 30న ఎన్డీఎఫ్బీకి చెందిన 1,550 మంది తీవ్రవాదులు ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు. 


బోడోల్యాండ్‌ ప్రాదేశిక మండలి(బీటీసీ) కింద ఉన్న 40 అసెంబ్లీ సీట్లను 60కి పెంచే ప్రతిపాదనా ఇందులో ఉన్నది. ఈ త్రైపాక్షిక ఒప్పందంపై ఎన్డీఎఫ్బీ, ఏబీఎస్‌యూ ప్రతినిధులు, అసోం సీఎం శర్వానంద సోనోవాల్‌, కేంద్ర హోం కార్యదర్శి సత్యేంద్ర గార్గ్‌, అసోం సీఎస్‌ కుమార్‌ సంజయ్‌ కృష్ణ సంతకం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ ఒప్పందం జరిగింది. ఇది చారిత్రక ఒప్పందమ ని, బోడో ప్రజలు గత దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న పలు సమస్యలకు దీని వల్ల శాశ్వత పరిష్కారం లభించగలదని షా ఆకాంక్షించారు. ‘ఈ ఒప్పందం బోడో ప్రజల బంగారు భవితకు బాటలు వేస్తుంది. బోడోల రాజకీయ, ఆర్థిక ఆకాంక్షలను నెరవేస్తుంది. 


బోడోల భాష, సంస్కృతులను కాపాడుతుంది’ అని షా అన్నా రు. బోడో మిలిటెంట్ల హింసలో గత కొన్ని దశాబ్దాల్లో సుమారు 4 వేలమంది మృతి చెందారన్నారు. ఈ ఒప్పందంతో ఇకపై అసోం, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు రాబోవని ఆశాభావం వ్యక్తం చేశారు. అసోం సీఎం శర్వానంద సోనోవాల్‌ మాట్లాడుతూ.. రాష్ర్టంలో అన్ని వర్గాల ప్రజలు ఇకపై సామరస్యంతో జీవనం సాగిస్తారన్నారు. అసోం మంత్రి హిమంతా బిశ్వశర్మ మాట్లాడుతూ.. ఒప్పందంలో పేర్కొన్నట్టు జనవరి 30న ఎన్డీఎఫ్బీకి చెందిన 1,550 మంది తీవ్రవాదులు ఆయుధాలతో లొంగిపోతారన్నారు. అలాగే, ప్రస్తుతం ఉన్న బీటీసీని మరింత బలోపేత చేయడానికి మరిన్ని అధికారాలు ఇవ్వడంతో పాటు దాని పరిధిలోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 


బోడో ప్రజలు ఎక్కువగా ఉన్న గ్రామాల ప్రాతినిథ్యంతో బీటీసీలో ఓ కమిషన్‌ను కూడా ఏర్పా టు చేయనున్నట్టు బిశ్వశర్మ వెల్లడించారు. బోడో మిలిటెంట్లు సృష్టించిన హింసాకాండలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రత్యేక రాష్ర్టం లేదా కేంద్ర పాలిత ప్రాంతం కోసం పోరాడుతున్న బోడో తీవ్రవాదులతో గత 27 ఏండ్ల కాలంలో రెండు ఒప్పందాలు జరిగాయి. 1993లో మొదటి ఒప్పందం, 2003లో మరో ఒప్పందం కుదిరాయి. మరోవైపు, బోడోలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చేసుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ బోడోయేతర సంస్థలు సోమవారం అసోంలో 12 గంటల బంద్‌ పాటించాయి.


శాంతి, సామరస్యానికి నవోదయం

ప్రభుత్వంతో బోడో తిరుగుబాటు గ్రూపులు సోమవారం చేసుకున్న ఒప్పందం శాంతి, సామరస్యం, సమైక్యతకు నవోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం తర్వాత తిరుగుబాటుదారులు జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధికి బాటలు వేస్తారని ఆయన ఆకాంక్షించారు. దేశానికి ఇవాళ ప్రత్యేకమైన రోజని ఆయన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.


logo