గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 20, 2020 , 21:54:51

కొవిడ్ వ్యాక్సిన్‌.. భారత్‌లో ముందుగా వాళ్లకే

కొవిడ్ వ్యాక్సిన్‌.. భారత్‌లో ముందుగా వాళ్లకే

ఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ప‌నిచేసే ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ డేటాబేస్‌ను ఏ విధంగా త‌యారు చేయాలో తెలుపుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ జిల్లా, రాష్ర్ట‌స్థాయి నోడ‌ల్ అధికారుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీచేసింది. ఈ వివ‌రాల‌నే ఈ- విన్(ఎల‌క్ర్టానిక్ వ్యాక్సిన్ ఇంట‌లిజెన్స్ నెట్‌వ‌ర్క్‌) కింద‌ కొవిడ్ వ్యాక్సిన్ బెనిఫిషియ‌రీ మేనేజ్‌మెంట్ సిస్టంలో అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించింది. కొవిడ్ వ్యాక్సిన్ ల‌బ్దిదారుల నిర్వ‌హ‌ణ వివ‌రాల‌ను ఏ విధంగా పొందుప‌ర‌చాలో తెలుపుతూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేర‌కు లేఖ రాశారు.

హెల్త్‌కేరే వ‌ర్క‌ర్స్ కొవిడ్ టీకా డ్రైవ్ ల‌బ్ధిదారుల‌ను గుర్తించ‌డానికి ఈ డేటాబేస్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలైన దాదాపు 7 నుంచి 10 ల‌క్ష‌ల‌ ఏఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌లు, సుమారు 15 ల‌క్ష‌ల నర్సులు, వైద్యాధికారులు, ఎంబీబీఎస్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌తో స‌హా అల్లోప‌తి వైద్యులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ డాక్ట‌ర్స్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్స్‌, ఆయూష్ వైద్యులు మొద‌ట‌గా కొవిడ్ వ్యాక్సిన్‌ను పొంద‌నున్నారు. అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది డేటాబేస్ సిద్ధం చేయాల్సిందిగా సూచించింది. అన్ని ర‌కాల టెక్నిషియ‌న్స్‌(ల్యాబ్స్‌, ఆపరేషన్ థియేటర్, మొదలైనవి), ఫార్మసిస్ట్‌లు, ఫిజియోథెరపిస్టులు, రేడియోగ్రాఫర్లు, వార్డ్ బాయ్స్, ఇతర పారామెడికల్ సిబ్బంది, ప‌రిశోధనా సిబ్బంది,  వైద్య, దంత, ఆయుష్, నర్సింగ్, పారామెడికల్ విద్యార్థుల జాబితాను కూడా సిద్ధం చేయాల్సి ఉంది.

మరో వ‌ర్గ‌ కార్మికులకు కూడా టీకాలు వేయాలని ప్రభుత్వం చూస్తోంది. సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్మెంట్ సిబ్బంది, బయోమెడికల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, అంబులెన్స్ డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది, అవుట్‌సోర్స్ ఏజెన్సీ ఉద్యోగులు, ఇతర సహాయక సిబ్బంది, క్లరికల్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2021 జూలై నాటికి సుమారు 400 మిలియన్ డోస్‌ల‌ వ్యాక్సిన్ స‌మ‌కూర్చుకుంటామ‌ని ఈ సమయానికి 25 నుంచి 30 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు.