బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 00:30:14

సీఏపీఎఫ్‌ పోస్టుల భర్తీకి కొత్త పద్ధతి

సీఏపీఎఫ్‌ పోస్టుల భర్తీకి కొత్త పద్ధతి
  • సివిల్‌ సర్వీసు పరీక్షల కిందకు తీసుకొచ్చే యోచనలో కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: పారామిలిటరీ దళాల్లో భాగమైన కేంద్ర సాయుధ పోలీసు దళాలు(సీఏపీఎఫ్‌)లోని పోస్టులకు నిర్వహించే ప్రవేశ స్థాయి పరీక్ష కోసం కొత్త నియామక ప్రక్రియను తీసుకువచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ పోస్టుల కోసం ఏటా నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీసు పరీక్షల్లో దీన్ని కలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకూ సీఏపీఎఫ్‌ పోస్టుల భర్తీ కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) పరీక్షలను నిర్వహిస్తున్నది. సీఏపీఎఫ్‌ పోస్టులను ఆర్గనైజ్డ్‌ గ్రూప్‌ ఏ సర్వీసు(ఓజీఏఎస్‌)లో చేరుస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం తీసుకున్నది. దీంతో సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ తదితర విభాగాలు ‘ఓజీఏఎస్‌' కేటగిరీలో చేరాయి. ఈ క్రమంలో ఆయా పోస్టుల భర్తీ,  పదోన్నతులకు ప్రత్యేక నియామక వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వీటి నియామకాన్ని సివిల్‌ సర్వీసు గొడుగు కిందకు తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 


logo