సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 01:18:04

పెట్రో లాభం.. ఖజానాకు మళ్లింపు!

పెట్రో లాభం.. ఖజానాకు మళ్లింపు!
  • పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ. 3 ఎక్సైజ్‌ సుంకం పెంపు
  • అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ..
  • ఆ లాభాన్ని తన ఖాతాలో వేసుకున్న కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 14: పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతూ శనివారం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో కేంద్ర ఖజానాకు రూ.39,000 కోట్ల వార్షికాదాయం సమకూరే అవకాశం ఉన్నది. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గాయి. దీంతో వాస్తవానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా తగ్గి సామాన్యులకు ఊరట లభించాలి. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు ఉండకపోవచ్చు. దీనికి కారణం.. సర్దుబాటు పేరుతో తగ్గిన చమురు ధరలకు ఎక్సైజ్‌ సుంకం పెంపు పేరిట ప్రభుత్వం మరికొంత మొత్తాన్ని వసూలు చేయడమే. కాగా ఎక్సైజ్‌ సుంకం పెంపు పేరిట తగ్గిన చమురు ధరల ఫలితాన్ని సామాన్య ప్రజలకు అందకుండా ప్రభుత్వం తన ఖజానాకు మళ్లిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. 


ప్రభుత్వం తీసుకున్న తాజా ఎక్సైజ్‌ సుంకం పెంపుదల నిర్ణయంతో రిటైల్‌లో లభించే పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అంతగా ప్రభావం ఉండకపోయినప్పటికీ, సామాన్యులకు మరింత తక్కువ ధరకు లభించాల్సిన పెట్రోల్‌, డీజిల్‌ ఆ విధంగా లభించే అవకాశం లేదని పారిశ్రామిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు నోటిఫికేషన్‌ ప్రకారం.. లీటర్‌ పెట్రోల్‌పై స్పెషల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని రూ.2 నుంచి రూ.8కి, డీజిల్‌పై రూ.4కు పెంచారు. అలాగే పెట్రోల్‌, డీజిల్‌పై రోడ్డు సెస్సును లీటరుకు రూ.1 పెంచారు. దీంతో ఈ సెస్సు రూ.10కి చేరింది. తాజా పెంపుతో లీటర్‌ పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్‌ సుంకం రూ.22.98కు, డీజిల్‌పై రూ.18.83కు ఎగబాకింది. 


15 నెలల్లో తొమ్మిది సార్లు పెంపు

అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో నవంబర్‌ 2014, జనవరి 2016 మధ్య  బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తొమ్మిదిసార్లు పెంచింది. ఈ 15 మాసాల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్‌ సుంకం పెరిగింది. దీంతో 2016-17లో ప్రభుత్వ ఖజానాకు రూ. 2,42,000 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, పెట్రోల్‌, డీజిల్‌పై  కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడంపై కాంగ్రెస్‌ మండిపడింది. పెంపు పేరుతో సర్కారు సామాన్యులను లూటీ చేస్తున్నదని ఆరోపించింది. 


logo