ఆదివారం 12 జూలై 2020
National - Jun 21, 2020 , 15:34:58

వైద్య, ఆరోగ్య సిబ్బందికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పొడిగింపు

వైద్య, ఆరోగ్య సిబ్బందికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పొడిగింపు

కేంద్ర సర్కారు నిర్ణయం

న్యూ ఢిల్లీ: కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండగా, మహమ్మారి కట్టడికి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకుగానూ కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇప్పటికే వర్తింపజేస్తున్న రూ. 50 లక్షల  హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో 22 లక్షల మందికి ఈ సెప్టెంబర్‌కు బీమా వర్తించనుంది. 

ఈ ఇన్సూరెన్స్‌ను న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ ద్వారా అందిస్తున్నారు. దీనికింద దేశవ్యాప్తంగా 22.12 లక్షల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ. 50 లక్షల సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా వర్తిస్తుంది. బీమా వర్తించేవారిలో రోగులతో ప్రత్యక్షంగా కలిసి వారి సంరక్షణ బాధ్యతలు చూసే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు కూడా ఉన్నారు. గత మార్చి నుంచి ఈ ఇన్సూరెన్స్‌ వర్తింపజేస్తున్నారు. దీనికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధర్వ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి ఫండ్స్‌ కేటాయిస్తున్నారు. కాగా, అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, హెల్త్‌ కేర్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ సెంటర్లలోని సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, శానిటేషన్‌ వర్కర్లకు ఈ బీమా వర్తిస్తుందని ప్రారంభంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయితే, కొవిడ్‌ -19 రోగులకు చికిత్స చేస్తున్న ప్రైవేట్‌ దవాఖాన సిబ్బందికి కూడా ఈ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. logo