శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 02:17:02

మృత్యుముఖం నుంచి స్వదేశానికి

మృత్యుముఖం నుంచి స్వదేశానికి
  • చైనా, జపాన్‌ నుంచి ఢిల్లీకి 195 మంది భారతీయులు
  • 41 మంది విదేశీయులు కూడా

న్యూఢిల్లీ/బీజింగ్‌/టోక్యో, ఫిబ్రవరి 27: కరోనా(కొవిడ్‌-19)తాకిడికి గురైన ప్రాంతాల్లో చిక్కుకొని.. చావులోగిలి వరకూ వెళ్లిన భారతీయులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వదేశానికి తీసుకొచ్చింది. వైరస్‌ వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌ నగరం నుంచి 112 మందిని, కరోనా ప్రబలడంతో జపాన్‌ తీరంలో నిలిచిపోయిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ఉన్న మరో 124 మందిని ఢిల్లీకి చేర్చినట్టు గురువారం ఆ శాఖ వెల్లడించింది. వుహాన్‌ నుంచి వచ్చిన తాజా బృందంలో 76 మంది భారతీయులతోపాటు మరో 36 మంది విదేశీయులు(బంగ్లాదేశ్‌-23, చైనా-6, మయన్మార్‌-2, మాల్దీవులు-2, దక్షిణాఫ్రికా-1, అమెరికా-1, మడగాస్కర్‌-1) ఉన్నారని, జపాన్‌ నుంచి వచ్చిన వారిలో 119 మంది భారతీయులతో పాటు మరో ఐదుగురు విదేశీయులు(శ్రీలంక-2, నేపాల్‌-1, దక్షిణాఫ్రికా-1, పెరూ-1) ఉన్నారని తెలిపింది. కరోనాతో పోరాడుతున్న చైనాకు సాయం అందించడంలో భాగంగా.. వాయుసేనకు చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానంలో భారత్‌ బుధవారం 15 టన్నుల వైద్య సామగ్రిని వుహాన్‌కు పంపించింది. వైద్య సామగ్రిని చేర్చాక.. సీ-17 తన తిరుగు ప్రయాణంలో అక్కడ ఉన్న 112 మందిని తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఎయిరిండియా సంస్థకు చెందిన రెండు విమానాల ద్వారా వుహాన్‌లోని దాదాపు 650 మంది భారతీయుల్ని కేంద్రం తీసుకురావడం తెలిసిందే. 


దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ.. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్‌ను అభిశంసించాలని డిమాండ్‌ చేస్తూ ఆ దేశంలో ఓ పిటిషన్‌ దాఖలైంది. దీనికి మద్దతిస్తూ ఆ పిటిషన్‌ మీద దాదాపు తొమ్మిది లక్షల మంది పౌరులు సంతకాలు చేశారు. మరోవైపు, చైనాలో కరోనాతో బుధవారం 29 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 2,722కు చేరింది. కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. మక్కా, మదీనా మసీదు సందర్శన (ఉమ్రా యాత్ర)కోసం వచ్చే విదేశీయులకు వీసా జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఇంకోవైపు ఇరాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మహిళా, కుటుంబ వ్యవహారాలు) మసౌమె ఎబ్తెకర్‌కు కరోనా సోకినట్టు ఆ దేశ అధికారులు గురువారం వెల్లడించారు.logo