ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 02:15:38

గవర్నర్‌ ‘కోలుకోవాలి’!

గవర్నర్‌ ‘కోలుకోవాలి’!

  • రాజస్థాన్‌ గవర్నర్‌పై  కాంగ్రెస్‌ డిజిటల్‌ యుద్ధం
  • దుష్ట ఆలోచనల నుంచి  కోలుకోవాలని ప్రచారం

జైపూర్‌/ న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో అసెంబ్లీని సమావేశ పర్చేందుకు ససేమిరా అంటున్న గవర్నర్‌ కల్‌రాజ్‌మిశ్రాపై కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ యుద్ధం ప్రకటించింది. ‘గెట్‌వెల్‌ సూన్‌ గవర్నర్‌' (గవర్నర్‌ త్వరగా కోలుకోవాలి) అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో ప్రచారం ప్రారంభించింది. దుష్ట ఆలోచనల నుంచి గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి అవినాశ్‌ పాండే మంగళవారం ట్వీట్‌ చేశారు. కేంద్రంలోని పెద్దలు చెప్పినట్టు గవర్నర్‌ ఆడుతున్నారని ఆరోపించారు. కల్‌రాజ్‌ మిశ్రాను గవర్నర్‌ పదవి నుంచి తొలగించాలని జైపూర్‌ హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలైంది. కాగా, 2009 నాటి మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సోదరుడు అగ్రసేన్‌ గెహ్లాట్‌కు మంగళవారం సమన్లు జారీచేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 22న అగ్రసేన్‌ ఆస్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది.

వెనకకు తగ్గని గెహ్లాట్‌

అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్‌తో సీఎం గెహ్లాట్‌ అమీతుమీకి సిద్ధమయ్యారు. క్యాబినెట్‌నోట్‌లో మార్పులు చేసి పంపాలన్న గవర్నర్‌ సూచనలను సీఎం పట్టించుకోలేదు. మంగళవారం కూడా మూడోసారి పాత విధానంలోనే ఆమోదించిన క్యాబినెట్‌ నోట్‌నే పంపారు. అందులో ఈ నెల 31న సభను సమావేశపర్చాలన్న విజ్ఙప్తి మాత్రమే ఉంది. సమావేశాల ఎజెండాను నిర్ణయించేది అసెంబ్లీ సలహాసంఘమని రాష్ట్ర మంత్రి ప్రతాప్‌సింగ్‌ ఖచరియవాస్‌ అన్నారు. కాగా, తన పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్న కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ఎమ్మెల్యేల కొనుగోలును దేశానికి పరిచయం చేసింది కాంగ్రెస్సేనని జేడీయూ నేత హెచ్‌డీ కుమారస్వామి విమర్శించారు.


logo