గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 01:48:19

నేడే కమల్‌నాథ్‌ విశ్వాస పరీక్ష

నేడే కమల్‌నాథ్‌ విశ్వాస పరీక్ష
  • మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆదేశం
  • విశ్వాస పరీక్షపై కాంగ్రెస్‌లో ధీమా
  • 16 మంది రెబెల్స్‌ రాజీనామాలపై వీడని సస్పెన్స్‌

భోపాల్‌, మార్చి 15: మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నెల 16న అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సీఎం కమల్‌నాథ్‌ను గవర్నర్‌ లాల్జీ టాండన్‌ శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆదేశించారు. తన ప్రసంగం ముగిసిన వెంటనే విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సీఎంకు గవర్నర్‌ ఒక లేఖ పంపారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ‘ఈనెల 16 ఉదయం 11 గంటలకు నా ప్రసంగంతో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అటుపై విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ నిర్వహించాలి’ అని తెలిపారు. విశ్వాస పరీక్ష సందర్భంగా సభ్యుల ఓటింగ్‌ను డివిజన్‌ చేయడంతోపాటు మొత్తం ప్రక్రియను వీడియోలో రికార్డు చేయాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సోమవారం నాడే విశ్వాస ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, కమల్‌నాథ్‌ విశ్వాస పరీక్ష నిర్వహణపై సోమవారం రూలింగ్‌ ఇస్తానని మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్పీ ప్రజాపతి తెలిపారు. రాజీనామా చేసిన మిగతా 16 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు తాము నేరుగా స్పీకర్‌ను కలువలేమని లేఖ రాశారు. దీంతో వారి భవితవ్యంపై కూడా స్పీకర్‌దే తుది నిర్ణయం కానున్నది. అసెంబ్లీలో విపక్ష నేత గోపాల్‌ భార్గవ ఆదివారం గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేతులెత్తే విధానం ద్వారా విశ్వాస పరీక్ష ఓట్లను డివిజన్‌ చేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరామన్నారు. అయితే, తొలిరోజు సభా వ్యవహారాలపై అసెంబ్లీ సెక్రటేరియట్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో విశ్వాస పరీక్ష ప్రస్తావన లేకపోవడంపై ప్రతిపక్ష బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై విపక్ష నేత గోపాల్‌ భార్గవ.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్ష వాయిదా వేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు.  మరోవైపు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ నుంచి ఆదివారం భోపాల్‌కు చేరుకున్నారు. 

చిక్కుల్లో కమల్‌నాథ్‌ సర్కార్‌

సింధియా వర్గంలోని ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 222కు పడిపోయింది. 112 మంది మద్దతు తెలిపితేనే కమల్‌నాథ్‌ గట్టెక్కుతారు. వారిలో 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించనందున కాంగ్రెస్‌ బలం 108 మందిగా ఉన్నది. ఇప్పటికే బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే బీజేపీ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలుసుకున్నారు. మరో నలుగురు స్వ తంత్రుల మద్దతు ఎటువైపు అన్నది కీలకం.


logo