ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 23:20:54

ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు

ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు

జైపూర్ : ఎట్టకేలకు అశోక్ గెహ్లాట్ కోరుకున్నట్టుగానే గవర్నర్ కలరాజ్ మిశ్రా అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. వచ్చే నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. గవర్నర్ ఆదేశాలతో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల ప్రతిష్ఠంభన కథ ముగిసినట్లయింది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటుతో గత కొన్ని రోజులుగా రాజస్థాన్ రాజకీయాలు రసకందాయంగా నడుస్తున్నాయి. తన మద్దతుదారులతో వేరు కుంపటి పెట్టుకున్న సచిన్ పైలట్.. ఏం చేయాలో తేల్చుకోలేని సంకట స్థితిలో ఉన్నారు. మరోవైపు తన ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆపద లేదని చెప్పుకునే తాపత్రయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉన్నారు. దాంతో గత కొన్ని రోజులుగా అసెంబ్లీని సమావేశపరచాలంటూ గవర్నర్ వెంటపడుతున్నారు. మూడు సార్లు గవర్నర్ కు ప్రతిపాదనలు పంపారు. ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రపతిని కలిసేందుకు కూడా సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపరిచేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎం అశోక్ గెహ్లాట్ ఎగిరిగంతేసినంత పనిచేశారు. అయితే, అసెంబ్లీని ఎందుకు సమావేశపరుస్తున్నాడనేది ఇంతవరకు సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

చివరకు వచ్చే నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. కొవిడ్-19 వ్యాప్తి నిరోధించడానికి జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ సెషన్ నిర్వహించేటప్పుడు అన్ని చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.

అంతకుముందు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, విశ్వాస ఓటును కోరడం ఎజెండా అయితే చిన్న నోటీసుతో సెషన్‌ను పిలవవచ్చని గవర్నర్ సూచించారు. అలా కుదరనిపక్షంలో 21 రోజుల నోటీసు అవసరమని ఆయన అన్నారు.

అసెంబ్లీ సమావేశాన్ని "పిలవకూడదని" ఎప్పుడూ ఉద్దేశించలేదని మూడుపేజీల లేఖలో గవర్నర్ కలరాజ్ మిశ్రా స్పష్టం చేశారు. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి, భౌతిక దూర నిబంధనలను నిర్వహించడానికి 21 రోజుల నోటీసు వ్యవధితో సహా మూడు అంశాలపై ఉద్దేశపూర్వకంగా ఆలోచించాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి సూచించారు. 

కాగా, ట్రస్ట్ ఓటు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయని, అయితే సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి పంపిన ప్రతిపాదనలో దాని గురించి ప్రస్తావించలేదని గవర్నర్ అన్నారు. 

వచ్చే నెల 14 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఎజెండా ఏమిటో తెలియక అధికారులు తర్జన, భర్జన పడుతున్నారు. 


logo