శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 21, 2020 , 16:00:11

'కశ్మీర్‌ టైమ్స్‌' ఆఫీస్‌ సీజ్‌.. రక్తపోరాటమే అంటున్న ఎడిటర్‌

'కశ్మీర్‌ టైమ్స్‌' ఆఫీస్‌ సీజ్‌.. రక్తపోరాటమే అంటున్న ఎడిటర్‌

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ కేంద్రంగా వెలువడుతున్న 'కశ్మీర్‌ టైమ్స్‌' కార్యాలయాన్ని అధికారులు సీజ్‌ చేశారు. తాము రాస్తున్న వార్తలపై ఆగ్రహంతోనే ప్రభుత్వం తమపై ఈ రక్తపోరాటం చేస్తున్నదని పత్రిక సహా సంపాదకురాలు అనురాధ భాసిన్‌. జమ్ముకశ్మీర్‌లోని పురాతన ఆంగ్ల దినపత్రికల్లో ఒకటిగా ఈ వార్తాపత్రిక నిలుస్తున్నది. 1990 లో ప్రభుత్వం కేటాయించిన స్థలం నుంచే కార్యాలయం పనిచేస్తున్నది. అయితే, నివాసిత ప్రాంతంగా కేటాయించగా.. వ్యాపారానికి వాడుకుంటున్నందునే కార్యాలయాన్ని సీజ్‌ చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు.

'కశ్మీర్‌ టైమ్స్‌' దినపత్రిక కార్యాలయాన్ని జమ్ముకశ్మీర్‌ ఎస్టేట్స్ విభాగం సీజ్‌ చేసింది. పత్రిక కార్యాలయానికి అధికారులు తాళం వేశారు. అప్పటి జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం తన తండ్రికి కేటాయించిన స్థలంలోనే పత్రిక కార్యాలయాన్ని స్థాపించి నడిపిస్తున్నామని, తమకు కేటాయించిన మరో స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నామని 'కశ్మీర్‌ టైమ్స్‌' పత్రిక సంపాదకుడు ప్రమోద్‌ జమ్వాల్‌, సహా సంపాదకురాలు అనురాధ భాసిన్‌ తెలిపారు. 2009 లో అప్పటి ఓమర్‌ అబ్దుల్లా ప్రభుత్వం తమ కార్యాలయం భవనాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేయగా.. కోర్టుకెళ్లి న్యాయం పొందామని చెప్పారు. గతంలో ఈ భవనానికి చేపట్టిన మరమ్మతుల ఖర్చులను కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం తమ కార్యాలయాన్ని సీజ్‌ చేయడంతో పత్రిక కార్యాలయాన్ని తన ఇంటికి మార్చానని సంపాదకుడు ప్రమోద్‌ జమ్వాల్‌ తెలిపారు.

ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతనే కార్యాలయాన్ని సీజ్‌ చేశామని ఎస్టేట్‌ అధికారులు చెప్తున్నారు. 1994 లో వేద్‌ భాసిన్‌కు నివాసిత స్థలంగా కేటాయించగా.. పత్రిక కార్యాలయం పెట్టినందునే నోటీసు పంపి చర్యలు తీసుకున్నామని వారు తెలిపారు. వేద్‌ భాసిన్‌ జీవించి లేనందున ఆయనకు కేటాయించిన స్థలాన్ని మరొకరికి నివాసిత స్థలంగా కేటాయించేందుకే 'కశ్మీర్‌ టైమ్స్‌' కార్యాలయం సీజ్‌ చేశామని వారు వెల్లడించారు. అయితే, ఐదేండ్ల క్రితం మరణించిన వేద్‌ భాసిన్‌ స్థలంపై ఇన్నేండ్ల తర్వాత చర్యలు తీసుకోవడంలో ఆంతర్యామేంటని ప్రశ్నించగా.. అధికారులు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారని అనురాధ భాసిన్‌ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించి.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సమయంలో కమ్యూనికేషన్ల దిగ్బంధనానికి వ్యతిరేకంగా పోరాడామని, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కూడా చూశామని, అందుకే అధికారులు తమపై రక్తపోరాటానికి సిద్ధమయ్యారని ప్రమోద్‌ జమ్వాల్‌ చెప్పారు. జర్నలిస్టుల ఉద్యమంలో కీలకంగా ఉండటంతో అనురాధ భాసిన్‌పై ప్రభుత్వం కక్షగట్టినట్లుగా తెలుస్తున్నదని పలువురు జర్నలిస్టులు తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.