శుక్రవారం 10 జూలై 2020
National - Jun 04, 2020 , 02:24:13

వ్యవసాయోత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్‌

వ్యవసాయోత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్‌

 • కష్టం రైతుదే.. లాభం రైతుకే
 • నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణలు
 • ఓపెన్‌ మార్కెట్‌ కోసం మరో 2 ఆర్డినెన్స్‌లు
 • కేంద్ర క్యాబినెట్‌ సమావేశం ఆమోదముద్ర
 • మారనున్న వ్యవసాయ మార్కెట్‌ ముఖచిత్రం

న్యూఢిల్లీ, జూన్‌ 3: రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా ఎలాంటి పరిమితులు లేకుండా అమ్ముకొనేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరున్నర దశాబ్దాలనాటి నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌.. రైతుల ఆదాయం పెంచటం, వ్యవసాయరంగంలో ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం, మార్కెట్‌తో రైతు ప్రత్యక్ష అనుసంధానం లక్ష్యంగా రూపొందించిన రెండు ఆర్డినెన్స్‌లను ఆమోదించింది. కొవిడ్‌- 19 సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఇటీవల రూ.20లక్షల కోట్లతో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో హామీ ఇచ్చిన మేరకు వ్యవసాయోత్పత్తులకు విస్తృత మార్కెటింగ్‌, రైతుల ఆదాయం పెంపు లక్ష్యాలుగా క్యాబినెట్‌ నిర్ణయాలు వెలువడ్డాయి.

నిత్యావసర సేవల చట్టాన్ని సవరించటంతోపాటు మరో రెండు నూతన ఆర్డినెన్స్‌లను క్యాబినెట్‌ ఆమోదించింది. ‘వ్యవసాయోత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం (ప్రోత్సాహం, సౌకర్యాలు)- 2020’ ఆర్డినెన్స్‌కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌లో ఉన్న అడ్డంకులను తొలగించటమే లక్ష్యంగా ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. ‘ధర, వ్యవసాయ సేవల హామీపై రైతుల (సాధికారత, భద్రత) ఒప్పందం -2020’ పేరుతో రూపొదించిన మరో ఆర్డినెన్స్‌కు కూడా క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసిందని సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. దేశ వ్యవసాయరంగంలో ఈ నిర్ణయాలు చరిత్రాత్మకమని పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న 6900 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలు(ఏపీఎంసీ), వాటి చట్టాలు ఇకముందు కూడా కొనసాగుతాయని చెప్పారు. ఏపీఎంసీల వెలుపల తాజా ఆర్డినెన్స్‌ అమలవుతుందని వెల్లడించారు. క్యాబినెట్‌ నిర్ణయాలు గ్రామీణ భారతదేశంపై గొప్ప సానుకూల ప్రభావం చూపనున్నాయని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.  

క్యాబినెట్‌ ఇతర నిర్ణయాలు..

 

 • కోల్‌కతా పోర్టు పేరు శ్యామప్రసాద్‌ ముఖర్జీ పోర్టుగా మార్పు.
 • పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ (పీడీసీ) ఏర్పాటు.
 • ఫార్మాకొపియా లాబొరేటరీ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (పీఎల్‌ఐఎం), హోమియోపతిక్‌ ఫార్మాకొపియా లాబొరేటరీ (హెచ్‌పీఎల్‌)లను విలీనంచేసి ఫార్మాకొపియా కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌ అండ్‌ హోమియోపతి ఏర్పాటు.

ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్‌

 • వ్యవసాయంలో సమూల మార్పులు
 • పొలంలోకి కార్పొరేట్‌ మార్కెటింగ్‌
 • పెరుగనున్న ప్రైవేటు పెట్టుబడులు
 • మంచి ధరకోసం రైతుకు బేరమాడే శక్తి

న్యూఢిల్లీ: వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణల కోసం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన రెండు ఆర్డినెన్స్‌లు  వ్యవసాయరంగంలో కార్పొరేట్‌ మార్కెటింగ్‌ విధానాలను ప్రవేశపెట్టనున్నాయి. రాష్ర్టాల్లో ఇప్పుడు కొనసాగుతున్న వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల (ఏపీఎంసీ)కు వెలుపల పంటను అమ్ముకొనేందుకు రైతుకు సంపూర్ణ స్వేచ్ఛ లభించనుంది. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌పై రాష్ర్టాల మధ్య ఉన్న పన్నులు, ఆంక్షలు పూర్తిగా తొలగిపోనుండటంతో ఒకేదేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్‌ ఆవిష్కృతం కానుంది.

సంపూర్ణపోటీలోకి రైతు

దేశంలోని ప్రతిరాష్ట్రం రైతులు తమ పంటను లాభసాటి ధరకు అమ్ముకొనేందుకు పలుచట్టాలు చేసి అమలుచేస్తున్నాయి. కానీ వాటిలో నిర్దేశిత మార్కెట్లలోనే అమ్ముకోవాలనే పరిమితులు ఎక్కువగా ఉండటంతో నష్టపోవాల్సి వస్తున్నది. పంట సమిష్టి దిగుబడి తక్కువ ఉన్నప్పుడు లాభాలు పొందుతున్న రైతులు, దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పడిపోయి  నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో పంటను మార్కెట్‌ బయట ఎక్కడైనా అమ్ముకొనేందుకు అవకాశం ఉంటే రైతుకు మంచి ధరకోసం బేరమాడే శక్తి ఉంటుంది. కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన తాజా ఆర్డినెన్స్‌లు అందుకు అవకాశం కల్పిస్తాయి. దేశంలోని ఏ మూలన ఉన్న రైతైనా ఎక్కడి రైతుతో అయినా పోటీ పడే అవకాశం ఉంటుంది.

టెక్నాలజీ, పెట్టుబడులు

వ్యవసాయం ఓపెన్‌ మార్కెట్‌ విధానంలోకి మళ్లుతుండటంతో రిటైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాలు విక్రయించే రిటైలర్లు నేరుగా రైతుతోనే ఒప్పందాలు చేసుకుంటారు. రైతులు ముందస్తు ఒప్పందం ప్రకారమే పంట వేస్తారు కాబట్టి నష్టభయం లేకుండా వ్యవసాయం చేస్తారు. విత్తనం నుంచి పంట మార్కెటింగ్‌ వరకు రైతుకు దేశవ్యాప్త మార్కెట్‌తో అనుసంధానం ఏర్పడుతుంది. పంట నిల్వకోసం ప్రైవేటు సంస్థలు  గిడ్డంగుల వంటి మౌలిక వసతులు భారీగా ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాగులో రైతుకు నూతన టెక్నాలజీలను పరిచయం చేస్తాయి. మొత్తంగా రైతుకు అదనపు ఆదాయాన్ని సమకూర్చిపెట్టడమే ఆర్డినెన్స్‌ల లక్ష్యమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రకటించారు. logo