గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 18:36:25

స‌వ‌ర‌ణ‌ల‌కు ఓకే అంటేనే మ‌ళ్లీ చ‌ర్చ‌లు: తోమ‌ర్‌

స‌వ‌ర‌ణ‌ల‌కు ఓకే అంటేనే మ‌ళ్లీ చ‌ర్చ‌లు: తోమ‌ర్‌

న్యూఢిల్లీ: ‌వివాదాస్ప‌ద కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ రెండు నెల‌లుగా దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌వ‌ధిక ఆందోళ‌న సాగిస్తున్న రైతుల‌తో శుక్ర‌వారం కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ జ‌రిపిన చ‌ర్చ‌లు అసంపూర్ణంగానే ముగిశాయి. ఇటు రైతు సంఘాల నేత‌లు, అటు కేంద్ర ప్ర‌భుత్వం త‌మ వైఖ‌రికే క‌ట్టుబ‌డి ఉండ‌టం గ‌మ‌నార్హం. త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం తెలిపితేనే త‌దుప‌రి చ‌ర్చ‌లు జరుగుతాయ‌ని కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ పేర్కొన్నారు. 

రైతుల అభ్యున్న‌తి కోస‌మే కేంద్రం ఈ చ‌ట్టాల‌ను తీసుకు వ‌చ్చింద‌ని, వాటిల్లో స‌వ‌ర‌ణ‌ల‌కు సిద్ధంగా ఉంద‌ని న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ చెప్పారు.దీంతో స‌ద‌రు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేందుకు సిద్ధంగా లేమ‌ని కేంద్రం తేల్చి చెప్పిన‌ట్ల‌యింది.  రైతు సంఘాలు దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని, ఓ అభిప్రాయానికి వ‌స్తే చ‌ర్చించ‌వ‌చ్చున‌న్నారు. తాము ప్ర‌తిపాదించిన స‌వ‌ర‌ణ‌ల‌కంటే మెరుగైన సూచ‌న‌లు ఉంటే తెలియ‌జేయాల‌ని రైతు సంఘాల నేత‌ల‌కు కేంద్రం తెలిపింది. 

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌న్న త‌మ డిమాండ్‌నే కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించాల‌ని రైతు సంఘాల నేత‌లు కోరారు. త‌దుప‌రి చ‌ర్చ‌ల తేదీ ఖ‌రారు కాకుండానే చ‌ర్చ‌లు ముగిశాయి. మ‌ధ్యాహ్న భోజ‌నం త‌ర్వాత కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ చ‌ర్చ‌ల‌కు రాలేద‌ని రైతు నేత రాకేశ్ తికాయిత్ చెప్పారు. ఈ నెల 26వ తేదీన రిప‌బ్లిక్ దినోత్స‌వం సంద‌ర్భంగా ట్రాక్ట‌ర్ల ర్యాలీ య‌థాత‌థంగా సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo