సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:06:24

థియేటర్లు ఓపెన్‌?

థియేటర్లు ఓపెన్‌?

  • 25శాతం సీటింగ్‌తో సినిమా హాళ్లకు అనుమతి!
  • మెట్రో, బడులు బంద్‌.. అన్‌లాక్‌ 3.0 విధివిధానాలపై కేంద్రం కసరత్తు
  • దేశంలో ఒకే రోజు రికవరీ కేసులు 36,145
  • 63.92 శాతానికి పెరిగిన రికవరీ రేటు
  • 2.31 శాతానికి  దిగొచ్చిన  మరణాలు
  • 24 గంటల్లో 4,42,263 పరీక్షలు
  • కొత్తగా 48,661 మందికి పాజిటివ్‌

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల్లో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్‌ 2.0 ఈ శుక్రవారంతో ముగియనున్నది. ఆగస్టు 1వ తేదీ నుంచి అన్‌లాక్‌ 3.0 ప్రారంభం కానున్నది. అన్‌లాక్‌ 3.0 విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ దశలో సినిమా హాళ్లు, వ్యాయామశాలలు(జిమ్‌) తెరిచే అవకాశం ఉన్నట్టు సంబంధిత అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. సినిమా హాళ్లలో భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, సీటింగ్‌ సామర్థ్యంలో 25% మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్టు సమాచారం. సినిమా హాళ్లు తెరిచే అంశంపై కేంద్ర ప్రసార శాఖ థియేటర్ల యజమానులకు సంప్రదించగా వారు 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతివ్వాలని కోరారు. అయితే మొదట 25 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లను తెరవాలని ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. మరోవైపు విద్యాలయాలు, మెట్రో సర్వీసులు అన్‌లాక్‌ 3.0లో కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. బడులను తెరవడంపై కేంద్ర మానవ వనరుల శాఖ రాష్ర్టాలతో సంప్రదింపులు జరుపుతున్నది. అయితే బడులను తెరవడంపై పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా వారు అంత సుముఖంగా లేరని  కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. 


logo