ఆదివారం 05 జూలై 2020
National - Jun 25, 2020 , 01:20:49

రోదసిలోకి ప్రైవేటు అడుగులు

రోదసిలోకి ప్రైవేటు అడుగులు

  • భారత అంతరిక్ష మౌలిక సదుపాయాలను
  • ప్రైవేటుసంస్థలు ఉపయోగించుకునేలా సంస్కరణలు
  • ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
  • 15 వేల కోట్లతో పశు సంవర్ధక ప్రత్యేక నిధి
  • ఓబీసీ కమిషన్‌ గడువు ఆరు నెలలు పెంపు 
  • కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, జూన్‌ 24: భారత అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ సంస్థలు కూడా పాల్గొనేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీని కోసం ‘ఇన్‌-స్పేస్‌' పేరిట కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ బుధవారం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ సహకార, రాష్ట్ర సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. రూ. 15 వేల కోట్లతో ఏర్పాటు చేసిన పశు సంవర్ధక మౌలిక సదుపాయాల ప్రత్యేక నిధికి అమోదం తెలిపింది. ముద్రా యోజనలో శిశు విభాగం కింద రుణాలు తీసుకున్న వారికి వడ్డీలో 2% రాయితీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. దీంతోపాటు ఓబీసీ కమిషన్‌ గడువును మరో 6 నెలలు పొడిగించింది.

అంతరాలను పూడ్చడానికే!

అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేబినెట్‌ నిర్ణయం వీలు కల్పిస్తుందని అణు విద్యుత్‌, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. భారత అంతరిక్ష మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థలు కూడా వినియోగించుకునేందుకు భారత జాతీయ అంతరిక్ష, అభివృద్ధి, అధికార కేంద్రం (ఇన్‌-స్పేస్‌) ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కొత్త సంస్కరణలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరిన్ని పరిశోధనలపై దృష్టి సారించవచ్చని, హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌ ప్రోగ్రాంలు, కొత్త టెక్నాలజీపై ప్రయోగాలు చేయవచ్చని తెలిపారు. ముద్రా యోజనలో లబ్ధిదారులకు 12 నెలల రాయితీ లభిస్తుందని కేంద్రం వివరించింది. ఈ నిర్ణయం వల్ల శిశు విభాగం కింద 9.37 కోట్ల ఖాతాదారులకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ తెలిపారు.

ఆరు నెలలు పొడిగింపు

ఓబీసీ ఉప వర్గీకరణను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఓబీసీ కమిషన్‌ వచ్చే ఏడాది జనవరి 31 వరకు కమిషన్‌ అమల్లో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా కమిషన్‌ కార్యకలాపాలపై ప్రభావం పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. జస్టిస్‌ జీ రోహిణి (రిటైర్డ్‌) నేతృత్వంలో  2017, అక్టోబర్‌లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

35 లక్షల ఉద్యోగాల కల్పన

పశు సంవర్ధక మౌలిక సదుపాయాల ప్రత్యేక నిధికి కేంద్ర కేబినెట్‌ అమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 15 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. పాలు, మాంసం, పశుగ్రాసం తదితర రంగాల్లో ఎంఎస్‌ఎంఈ పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రంగాల్లో 35 లక్షల ఉద్యోగాల కల్పన జరుగనున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. పాల ఉత్పత్తి రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 10,000 కోట్లను డెయిరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (డీఐడీఎఫ్‌) ఆమోదించిందని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. నాబార్డు ఆధ్వర్యంలో రూ. 750 కోట్లతో క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం వెల్లడించింది. 


logo