శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 19, 2020 , 19:41:06

భారత్‌లో పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే..

భారత్‌లో పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే..

హైదరాబాద్ : కరోనా కష్టకాలంలోనూ భారతదేశంలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగి తులం బంగారం (10 గ్రాములు) రూ 50,000 లకు చేరువ అయ్యాయి. అయినా సరే వినియోగదారులు కొంటూనే ఉన్నారు. భారతీయులకు, బంగారానికి విడదీయలేని సంబంధం ఉంటుంది కాబట్టి కొనుగోళ్లు అధిక స్థాయిలో సంతృప్తికరంగానే జరుగుతున్నాయి. పెండ్లిళ్ల సీజన్లో అమ్మకాలు సహజంగానే మరింతగా పుంజుకుంటాయి. అయితే, ప్రస్తుతం ఇండియా లో బంగారం ధరలు ఇంతలా పెరగటానికి మాత్రం కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది.

కానీ మన దగ్గర వినియోగానికి తగినంత బంగారం నిల్వలు లేవు. కాబట్టి, ఇండియా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే సరుకుల డెలివరీ ఆలస్యం అవుతోంది. అనేక ఆంక్షల నడుమ దిగుమతులు ప్రభావితం అవుతున్నాయి. అది కాస్త స్థానికంగా ఉండే బంగారం ట్రేడర్లు వరంగా మారిపోయింది. ఇదే అదనుగా ధరలు అమాంతం పెంచేస్తున్నారు. కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోయాయి.

గతేడాది జూన్ తో పోల్చితే ప్రస్తుత జూన్ లో బంగారం దిగుమతులు 86శాతం పడిపోవటం గమనార్హం. సాధారణంగా భారత్ ఏటా సుమారు 800 టన్నుల నుంచి 900 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే సగటున నెలకు 70 టన్నుల నుంచి 80 టన్నుల మేరకు బంగారం దిగుమతి అవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాక్ డౌన్ లో దాదాపు 99శాతం గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోగా... మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంత మేరకు పుంజుకుంటున్నాయి. కానీ సాధారణ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం దిగుమతులు 15శాతం తక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం బంగారం ధరల పై పడుతున్నది.


logo