గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 12:35:24

భారత్ లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు...

భారత్ లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు...

ఢిల్లీ : కరోనా ఎఫెక్ట్ భారతదేశంలోని ఎగుమతి, దిగుమతులపై తీవ్రంగా పడింది. కరెంట్ అకౌంట్ లోటు పై ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారీగా తగ్గాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2019-20 ఇదే క్వార్టర్‌లో పసిడి దిగుమతులు 11.5 బిలియన్ డాలర్లు (రూ.86,250 కోట్లు)గా ఉండగా, ఈసారి 688 మిలియన్ డాలర్లకు (రూ.5,160 కోట్లు) పడిపోయింది. ఏకంగా 94 శాతం దిగుమతులు తగ్గాయని ఈ నివేదిక తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ మొదటి క్వార్టర్‌లో పసిడి దిగుమతులు భారీగా అదుపులోకి వచ్చాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు కూడా 45 శాతం తగ్గి 57.50 కోట్ల డాలర్ల (సుమారు రూ.4,300 కోట్లు)కు పరిమితమయ్యాయి.

కరోనా సంక్షోభానికి తోడు, ధరలు బాగా పెరగడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పసిడి ధరలు రూ.40వేలకు కాస్త అటు ఇటుగా ఉండగా, ఈ ఆరు నెలల కాలంలో ఏకంగా రూ.11వేలకు పైగా పెరిగి, రూ.51వేలకు చేరుకుంది. ఈ కారణంగా కూడా సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి దూరం జరుగుతున్నారు. బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గిపోవడంతో భారత వాణిజ్య లోటు ఏప్రిల్ - జూన్ నెలలో 912 కోట్ల డాలర్లు (రూ.68,400 కోట్లు)కు పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే కాలంలో వాణిజ్య లోటు 4,596 కోట్ల డాలర్లు (రూ.3,44,700 కోట్లు)గా ఉంది.

సాధారణంగా భారత్ ప్రతి సంవత్సరం 800 టన్నుల నుండి 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఏప్రిల్ - జూన్ కాలంలో వజ్రాభరణాల ఎగుమతులు 72 శాతం క్షీణించి 270 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య లోటు తగ్గడంతో జనవరి-మార్చి కాలంతో పోలిస్తే ఇండియా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.1 శాతం నమోదయింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే వాణిజ్య లోటు 4.6 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.7 శాతం తగ్గింది. గత ఏడాది డిసెంబర్ నుండి బంగారం దిగుమతులు క్రమంగా పడిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దిగుమతులు వరుసగా 62.6 శాతం, 99.93 శాతం, 98.4 శాతం, 77.5 శాతం తగ్గాయి.logo