బుధవారం 03 జూన్ 2020
National - Jan 28, 2020 , 01:44:07

కోర్టులో రాజకీయాలొద్దు.. టీవీల్లో చర్చించుకోండి

కోర్టులో రాజకీయాలొద్దు.. టీవీల్లో చర్చించుకోండి
  • బీజేపీ, కాంగ్రెస్‌ న్యాయవాదులకు సీజేఐ చురక

న్యూఢిల్లీ: కోర్టులో రాజకీయాలొద్దని, ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావించవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలపై టీవీ చానల్‌లో చర్చించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన న్యాయవాదులకు చురకలంటించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త దులాల్‌ కుమార్‌ రాజకీయహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ భాటియా, బెంగాల్‌ ప్రభుత్వం తరఫున కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. పార్టీ కార్యకర్త తరఫున బీజేపీ పిటిషన్‌ దాఖలు చేయడాన్ని సిబల్‌ వ్యతిరేకించారు. ఓ రాజకీయ పార్టీ పిటిషన్‌ దాఖలు చేయవచ్చా అన్నది ధర్మాసనం పరిశీలించాలని కోరారు. స్పందించిన సీజేఐ బోబ్డే ‘ప్రతిపక్ష పార్టీలు కూడా సుప్రీంకోర్టును వినియోగించుకుంటున్న సంగతి మాకు తెలుసు. రాజకీయ వివాదాల పరిష్కారం కోసం ఇరువర్గాలు (అధికార, ప్రతిపక్షాలు) కోర్టును వాడుకుంటున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరిద్దరూ టీవీ చానల్‌ వద్దకెళ్లి రాజకీయాలపై చర్చించుకుంటే మంచిది’ అని భాటియా, సిబల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


logo