శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 11, 2020 , 07:14:51

దేశదేశాల్లో కరోనా విలయతాండవం.. లక్షమంది బలి

దేశదేశాల్లో కరోనా విలయతాండవం.. లక్షమంది బలి

  • 8 రోజుల్లో రెట్టింపు మరణాలు దేశదేశాల్లో కరోనా విలయతాండవం
  • ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం
  • మొత్తం మరణాల్లో దాదాపు సగం గత వారం రోజుల్లోనే
  • అమెరికా, యూరప్‌లో వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం 

బ్రసెల్స్‌, ఏప్రిల్‌ 10: కరోనా పిడికిలిలో చిక్కి ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ మహమ్మారితో మృత్యువాతపడిన వారి సంఖ్య లక్ష దాటింది. శుక్రవారంనాటికి  1,01,559 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. అమెరికాలో గురువారం మరో 1,700 మంది ప్రాణాలు కోల్పోగా, ఐరోపా దేశాల్లోనూ వందల మంది మృత్యువాతపడ్డారు. మహమ్మారి మొదలైనప్పటి నుంచి చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో దాదాపు సగం ఈ వారం రోజుల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. అయితే అమెరికా, ఐరోపా దేశాల్లో రోజూవారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ‘మహమ్మారి రాజేసిన అగ్ని అదుపులోకి రావడం మొదలైంది’ అని స్పెయిన్‌ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో గురువారం 757 మంది మరణించగా, శుక్రవారం ఆ సంఖ్య 683కు తగ్గింది. మరోవైపు, ఫ్రాన్స్‌లో తొలిసారి ఐసీయూలో చేరే రోగుల సంఖ్యలో తగ్గుదల నమోదుకావడం విశేషం. అమెరికాలో శుక్రవారం మరో 1783 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజు (1973) కంటే ఇది తక్కువ. ఇప్పటివరకు అమెరికాలో 16,500 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 4,60,000 మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. కరోనాకు కేంద్రస్థానంగా ఉన్న న్యూయార్క్‌లో గురువారం 799 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, శుక్రవారం కొత్తగా 200 కేసుల మాత్రమే నమోదయ్యాయని గవర్నర్‌ ఆండ్రూ క్యూమో తెలిపారు. కరోనా బారిన పడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం మెరుగుపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మూడు రోజుల అనంతరం ఆయన ఐసీయూ నుంచి బయటపడ్డారు. 

యెమెన్‌లో తొలి పాజిటివ్‌ కేసు..

అంతర్యుద్ధంతో ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన యెమెన్‌లో తాజాగా కరోనా మహమ్మారి కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తున్నది. ఆ దేశంలో శుక్రవారం తొలి కరోనా కేసు నమోదైంది. బ్రెజిల్‌లో శుక్రవారం తొలి మరణం నమోదైంది. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో జర్మనీ శుక్రవారం ఐరాస భద్రతా మండలి సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించింది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ దీన్ని ప్రారంభించారు. కరోనాపై పోరాడేందుకు ప్రపంచదేశాలు ఘర్షణలకు ముగింపు పలుకాలని కోరారు. దీనిపై స్పందించిన సౌదీ అరేబియా.. యెమెన్‌లో రెబల్స్‌పై తమ దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, చమురు యుద్ధానికి ముగింపు పలుకాలని సౌదీ, రష్యాను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు మెక్సికో మినహా మిగిలిన అన్ని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు అంగీకరించాయని ఒపెక్‌ తెలిపింది.

170 దేశాల్లో తగ్గనున్న తలసరి ఆదాయం.. 

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వ్‌ అమెరికన్లకు సొంతంగా 2.3 లక్షల కోట్ల డాలర్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడనుందని, 180 సభ్యదేశాలకు గానూ 170 దేశాల్లో తలసరి ఆదాయం తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. logo