గురువారం 09 జూలై 2020
National - Jun 20, 2020 , 18:35:26

శుభవార్త: కరోనా చికిత్సకు ఓరల్‌ డ్రగ్‌ రెడీ

శుభవార్త: కరోనా చికిత్సకు ఓరల్‌ డ్రగ్‌ రెడీ

ముంబై: శుభవార్త.. కరోనాతో అతలాకుతలం అవుతున్న దేశానికి ఉపశమనం కలిగించే న్యూస్‌. భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ డ్రగ్స్‌పై గ్లెన్‌మార్క్‌ స్టడీ చేసింది. ఫవిపిరవిర్‌ను కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి చికిత్స విధానంలో ఓరల్‌ డ్రగ్‌గా వినియోగించవచ్చని తేల్చింది. దీనిపై మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా, ఫాబిఫ్లూ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇండియన్‌‌ డ్రగ్స్‌ రెగ్యులరేటర్‌ (భారత ఔషధ నియంత్రణ సంస్థ) నుంచి అనుమతి కూడా లభించిందని పేర్కొంది. 

 కాగా, దేశంలో త్వరలోనే ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని, ఇందుకు కేంద్ర సర్కారు సహాయం తీసుకుంటామని గ్లెన్‌మార్క్‌ చైర్మన్‌ గ్లెన్‌ సల్దన్హా స్పష్టం చేశారు. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ. 103 ఉంటుందని, వైద్యుల ప్రిస్కిప్షన్‌ ఆధారంగానే విక్రయాలు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. దీనిని కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న మధుమేహ, గుండెజబ్బుగలవారు కూడా వాడవచ్చని సూచించారు. నాలుగు రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందని, వైరల్‌ లోడ్‌ను ఇది తగ్గిస్తుందని పేర్కొన్నారు. తమ క్లినికల్‌ ట్రయ్‌ల్స్‌లో పాజిటివ్‌ రిజల్ట్స్‌ వచ్చాయని గ్లెన్‌ సల్దన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఫవిపిరవిర్‌ను జపాన్‌ ఫుజి ఫిలిమ్స్‌ ఆధీనంలోని సంస్థ అయిన ఆవిగాన్‌ పేరుతో మొదట తయారుచేశారు. దీనికి 2014లో యాంటీ ఫ్లూ డ్రగ్‌గా వాడేందుకు అనుమతి లభించింది.logo