గురువారం 28 జనవరి 2021
National - Nov 26, 2020 , 00:06:32

నేడు సార్వత్రిక సమ్మె

నేడు సార్వత్రిక సమ్మె

  • కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కార్మికుల జంగ్‌  
  • ఉప్పెనలా ఎగసిపడుతున్న కార్మికులు, కర్షకులు
  • రోడ్లపైకి 30 కోట్లమంది.. రాష్ట్రంలోనే కోటి మంది  
  • నిలిచిపోనున్న బ్యాంకు, రవాణా సేవలు 

హైదరాబాద్‌/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దశాబ్దాలుగా లక్షలమంది త్యాగాలతో నిర్మాణమైన వ్యవస్థలను, సంస్థలను ధ్వంసం చేయటమే పనిగా పెట్టుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కార్మిక, కర్షకలోకం సమరశంఖం పూరించింది. మోదీ ప్రభు త్వ ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై కోట్లమంది కార్మికులు, కర్షకులు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నారు. 

30 కోట్లమంది ఉద్యమబాట

గల్లీ గల్లీ ఒక్కటై ఢిల్లీని దద్దరిల్లేలా చేసేందుకు కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, నిరుద్యోగులంతా కదం తొక్కుతున్నారు. 9 జాతీయ కార్మిక సంఘాలు, 500కు పైగా రైతు సంఘాల నాయకత్వంలో 30 కోట్లమంది సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కోటి మంది కార్మికులు, కర్షకులు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్టు కార్మిక, రైతు సంఘాల నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థల ఉద్యోగులు, ఎయిర్‌ లైన్స్‌ ఉద్యోగులు, రైల్వే కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములవుతున్నారు. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

సమ్మెలోకి సకల వర్గాలు

రాష్ట్రంలోని 1500 బ్యాంకు శాఖల్లోని 25 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. సమ్మెలో రవాణారంగంలోని కార్మికులు, క్యాబ్‌ డ్రైవర్లు, అటో డ్రైవ ర్లు కూడా పాల్గొంటున్నారని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు నరసింహన్‌ తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనేలా టీఆర్‌ఎస్‌ కార్మిక విభా గం నాయకులు ఇప్పటికే చైతన్యపర్చారు. అన్ని పారిశ్రామిక వాడల్లో టీఆర్‌ఎస్‌ కేవీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. రాష్ట్రంలో గురువారం ఆటో, క్యాబ్‌, లారీల సేవలు నిలిపేస్తున్నామని ఆయా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీలు ప్రకటించా యి. ఇందిరాపార్క్‌ వద్ద జరిగే ధర్నాలో అన్నిరంగాల కార్మికులు పాల్గొనాలని ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీ యూ, సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, ఐఎన్టీయూసీ, టీఎన్‌టీయూసీ, క్యాబ్‌ జేఏసీ, ఆటో జేఏసీలు పిలుపునిచ్చాయి. విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ  నేత రత్నాకర్‌ రావు తెలిపారు. సమ్మెకు వాటర్‌వర్క్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ తెలంగాణ సంపూర్ణ మద్దతు తెలిపింది. గురువారం భోజన విరామ సమయంలో ఖైరతాబా ద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో ధర్నా చేపట్టనున్నట్టు యూనియన్‌ అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ చెప్పారు. సార్వత్రిక సమ్మెకు తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (టీయూడబ్ల్యూజే) సం పూర్ణ మద్దతు తెలిపింది. జర్నలిస్టులు సమ్మెలో భాగస్వామి కావాలని నిర్ణయించినట్టు యూ నియన్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధానకార్యదర్శి మారుతి సాగర్‌ తెలిపారు. 

ఢిల్లీకి రైతుదండు

న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌ తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా రైతులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఆలిండియా కిసాన్‌ సం ఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ, రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ పిలుపు మేరకు వేలాది మంది రైతన్నలు దేశ రాజధానివైపు కదులుతున్నారు. 26, 27 తేదీల్లో (గురు, శుక్రవారాల్లో) ఢిల్లీలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో సహా పంజాబ్‌-హర్యానా సరిహద్దులకు చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు హర్యానా, ఢిల్లీ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. హర్యానాలో రైతులపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. మరోవైపు, కరోనా నేపథ్యంలో నిరసనలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు: వినోద్‌కుమార్‌

సార్వత్రిక సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ప్రకటించారు. బుధవారం సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. లాభాల బాటలో నడుస్తున్న ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, హెచ్‌ఏఎల్‌ వంటి అనేక సంస్థలను నట్టేట ముంచుతున్న మోదీ సర్కారు చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. కార్మికలోకమంతా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ నేతలు వీరయ్య, వెంకటేశ్‌, భాస్కర్‌, ఏఐటీయూసీ నాయకులు నరసింహన్‌, బోస్‌, నర్సింహ, బాలరాజు, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, ఇంచార్జి రూప్‌సింగ్‌, రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకుడు యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేశాన్ని రక్షించుకోవడానికే సమ్మె

ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేసేలా నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చారు. ఫిక్స్‌టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ తీసుకొచ్చారు. దేశాన్ని కార్పొరేట్‌ శక్తుల నుంచి రక్షించుకోవడానికే ఈ సమ్మె.

- వీ దానకర్ణాచారి, బీడీఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (తెలంగాణ అధ్యక్షుడు)

కార్పొరేట్‌ శక్తుల కోసమే ప్రైవేటీకరణ

కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా లేబర్‌ కోడ్లను మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభు త్వం తీసుకొచ్చింది. 2000 నుంచి 2004 మధ్యకాలంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ మొదలైంది. 

-బూర్గుల ప్రదీప్‌, ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఢిల్లీ ముట్టడికి సిద్ధమైన రైతులు

30 కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. 5 వేల రైతు సంఘాల నాయకత్వంలో లక్షల మంది రైతులు 26, 27 తేదీల్లో ఢిల్లీని ముట్టడించడానికి సిద్ధమయ్యా రు. రాష్ట్రంలోని కార్మికులు సమ్మెలో పాల్గొని బీజేపీపై నిరసన వ్యక్తం చేస్తారు. 

- బాలరాజు,  ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు


logo