గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 01:44:33

గెహ్లాట్‌ బల ప్రదర్శన!

గెహ్లాట్‌ బల ప్రదర్శన!

  • వచ్చేవారం ఫ్లోర్‌ టెస్ట్‌?
  • మేమే కింగ్‌ మేకర్స్‌: బీటీపీ

జైపూర్‌: రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌ అసెంబ్లీలో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. సచిన్‌పైలట్‌ తిరుగుబాటుతో ప్రభు త్వం మైనారిటీలో పడిందన్న విపక్షాల విమర్శలకు సభలోనే సమాధానం చెప్పాలని సీఎం నిర్ణయించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి మద్దతిస్తున్న భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) ఇక తామే కింగ్‌మేకర్స్‌మని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యే బన్వర్‌లాల్‌ శర్మను విచారించేందుకు రెండోసారి ఆదివారం హర్యానాలోని మనేసర్‌ వెళ్లిన రాజస్థాన్‌ పోలీసులను హోటల్‌ సిబ్బంది లోపలికి రానీయలేదు.  జైపూర్‌లో లగ్జరీ హోటల్లో క్యాంపు వేసిన గెహ్లాట్‌ వర్గం ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడు తూ, సినిమాలు చూస్తూ జల్సా చేస్తున్నారు.  

త్వరలోనే అవిశ్వాస పరీక్ష

తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ను ఆత్మరక్షణలోకి నెట్టిన సీఎం అశోక్‌గెహ్లాట్‌ వెంటనే అసెంబ్లీలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించారు. వచ్చేవారం ఒకటిరెండు రోజులు అసెంబ్లీని సమావేశపర్చనున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌మిశ్రాను కలిసిన సీఎం, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందజేసినట్టు సమాచారం. ‘అసెంబ్లీలో బలనిరూపణ ఎప్పుడు, ఎలా అన్నది సీఎం నిర్ణయిస్తారు. అసలు ఫ్లోర్‌ టెస్ట్‌ అవసరమా కాదా అన్నదానిపైనా ఆయనే నిర్ణయం తీసుకుంటారు’ అని కాంగ్రెస్‌ నేత అజయ్‌మాకెన్‌ ఆదివారం వెల్లడించారు. హార్స్‌ట్రేడింగ్‌కు ప్రయత్నించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాం డ్‌ చేశారు. కాగా, 200 మంది సభ్యులున్న సభలో తనకు 107మంది ఎమ్మెల్యేల మద్ద తు ఉందని సీఎం చెప్తున్నారు. సీపీపీం, బీటీపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు ఇద్దరేసి సభ్యులున్నారు. గెహ్లాట్‌ సర్కారుకు మద్దతు ప్రకటించిన బీటీపీ అధినేత మహేశ్‌భాయ్‌ సీ వాసవ, సభలో బలపరీక్ష జరిగితే తామే కింగ్‌మేకర్‌ అవుతామని తెలిపారు. 

ఫోన్‌ సంభాషణలపై కేంద్రం నజర్‌

రాజస్థాన్‌ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రయత్నించారని ఆరోపించిన కాంగ్రెస్‌, అం దుకు ఆధారంగా ఫోన్‌ సంభాషణల రికార్డులను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ టేపులే ఆధారంగా రాజస్థాన్‌ సంక్షోభంలోకి కేంద్రం నేరుగా ప్రవేశించింది. తమ ఫోన్లను గెహ్లాట్‌ ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తున్నదని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. కాగా, 8 నెలల క్రితమే బీజేపీ నేత సంజయ్‌జైన్‌ ద్వారా మాజీ సీఎం వసుంధర తన రాయబారం పంపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా ఆరోపించారు. logo