ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 17:24:30

రిసార్టుకు.. రాజస్థాన్ సీఎం, ఎమ్మెల్యేలు

రిసార్టుకు.. రాజస్థాన్ సీఎం, ఎమ్మెల్యేలు

జైపూర్: రాజస్థాన్‌లో మరోసారి రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. సీఎం అశోక్ గెహ్లాట్‌తో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక హోటల్‌లో విడిది చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఎదురుతిరుగడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని, ప్రభుత్వం మైనార్టీలో పడిందని సచిన్ పైలట్ ఆదివారం పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్‌ సోమవారం తన నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశమయ్యారు. తన వెంట 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తమ ప్రభుత్వం స్థిరంగానే ఉన్నదని ఆయన తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గెహ్లాట్ మీడియాకు విక్టరీ సింబల్ చూపారు. అయితే అనూహ్యంగా సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రిసార్టుకు తరలివెళ్లారు. సీఎం అశోక్ గెహ్లాట్ కూడా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బస్సుఎక్కి వారి వెంట హోటల్‌కు వెళ్లారు.

మరోవైపు ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. సోనియా, రాహుల్‌తో సహా కాంగ్రెస్ నేతలంతా సచిన్ పైలట్ కోసం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతారని ఆ పార్టీ సీనియర్ నేత సుర్జేవాలా చెప్పారు. కాగా, సచిన్ పైలట్ బీజేపీలో చేరడం లేదని ఆయన అనుచరుడు సోమవారం స్పష్టం చేశారు. సచిన్‌తో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నప్పటికీ తన పట్టును ఆయన విడువడం లేదు.

ఈ నేపథ్యంలో మరింత మంది ఎమ్మెల్యేలు చేజారి పోకుండా సీఎం అశోక్ గెహ్లాట్‌తో సహా ఎమ్మెల్యేలను ఓ హోటల్‌కు కాంగ్రెస్ పార్టీ తరలించింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది.
logo