ఆదివారం 29 మార్చి 2020
National - Feb 11, 2020 , 02:17:33

ఢిల్లీలో దుశ్శాసన పర్వం

ఢిల్లీలో దుశ్శాసన పర్వం
  • గార్గి కళాశాల విద్యార్థినులను లైంగికంగా వేధించిన దుండగులు
  • క్యాంపస్‌ గోడ దూకి, హస్త ప్రయోగం చేస్తూ.. తాకుతూ వికృత చేష్టలు
  • పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదన్న విద్యార్థినులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దుశ్శాసన పర్వం చోటుచేసుకున్నది. చదువులకు ఆలయంగా భావించే కాలేజీ.. వంద మంది కౌరవుల ప్రవేశంతో కురు సభను తలపించింది. ఎంతో ఉల్లాసంగా జరుపుకోవాలనుకున్న కాలేజీ సాంస్కృతిక వేడుక ఆ విద్యార్థినులకు పీడకలను మిగిల్చింది. గోడదూకి కాలేజీలోకి చొరబడిన ఓ అల్లరి మూక తమ వికృత చేష్టలతో ఆ విద్యార్థినులను లైంగికంగా వేధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని గార్గి కళాశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం క్యాంపస్‌లో ఆ కాలేజీ విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నెల 6న గార్గి కాలేజీ కల్చరల్‌ ఫెస్టివల్‌ సందర్భంగా కొందరు వ్యక్తులు క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థినులపై వికృత చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. బాధిత విద్యార్ధినులు సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగినప్పుడు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఢిల్లీ పోలీస్‌ సిబ్బంది అక్కడే ఉన్నా చూసీ చూడనట్టు వదిలేశారని ఆరోపిస్తూ విద్యార్థినులు కాలేజీ గేటు ముందు సోమవారం ధర్నా చేపట్టారు. 


గురువారం జరిగిన ఘటనను ఓ విద్యార్ధిని వివరిస్తూ.. ‘సుమారు వందమందివరకుగల ఓ గుంపు.. కాలేజీ గేటును తోసుకుంటూ, గోడలు దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించింది. వాళ్లంతా మద్యం సేవించి విచక్షణ లేకుండా ప్రవర్తించారు. అసభ్యంగా తాకుతూ వికృత చేష్టలకు దిగారు. దీంతో అమ్మాయిలు భయపడి బాత్రూంల వైపు పరుగెత్తినప్పటికీ.. అక్కడికి కూడా వచ్చి బయట నుంచి గడియలు పెట్టారు’ అంటూ వెల్లడించింది. కాలేజీలోకి ప్రవేశించిన దుండగులు మధ్య వయస్కులని, విద్యార్థినుల ముందే వాళ్లు హస్తప్రయోగం చేస్తూ.. వికృత చేష్టలకు పాల్పడుతూ భయపెట్టారని మరో విద్యార్థిని పేర్కొన్నారు.ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మరోవైపు, సీఏఏకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తులే ఈ ఘటన వెనుక ఉన్నారని సీపీఎం అనుబంధ మహిళా విభాగం ఐద్వా ఆరోపించింది.


logo