గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 14:58:19

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఇంటిని కూల్చేసిన అధికారులు

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఇంటిని కూల్చేసిన అధికారులు

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో గ్యాంగ‌స్ట‌ర్ వికాశ్ దూబే ఇంటిని అధికారులు ఇవాళ కూల్చివేశారు. కాన్పూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 8 మంది పోలీసులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో గ్యాంగ్‌స్ట‌ర్ వికాశ్ దూబేనే ప్ర‌ధాన నిందితుడు.  కాన్పూర్ స‌మీపంలో ఉన్న బికారు గ్రామంలో వికాశ్ దూబేను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జ‌రిగాయి. ఆ కాల్పుల్లో ఓ డీఎస్పీ స‌హా 8 మంది పోలీసులు మృతిచెందారు.  

60 కేసుల్లో నిందితుడు..

గ్యాంగ్‌స్టర్ వికాశ్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లిన స‌మ‌యంలో..  పోలీసులపై ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌ తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఆ త‌ర్వాత పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిపోయారు. 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేసేందుకు డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 16 మంది పోలీసుల బృందం గురువారం అర్ధరాత్రి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆ రౌడీలు ముందే మాటువేశారు. పోలీసుల వాహనం వెళ్తున్న దారిలో జేసీబీని అడ్డుగా పెట్టారు. వారు కిందకి దిగగానే భవనాలు, ఇండ్లపై నుంచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దేవేంద్ర మిశ్రా సహా 8మంది పోలీసులు చనిపోయారు. వీరిలో ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఒక సాధారణ పౌరుడు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. అనంతరం ఆ రౌడీ షీటర్లు పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన గురించి తెలియగానే కాన్పూర్‌ అడిషనల్‌ డీజీపీ జయనారాయణ్‌ సింగ్‌, కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామం చుట్టూ పోలీసులు మోహరించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాస్‌దూబే గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు రౌడీలు చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. వికాస్‌ దూబే కోసం గాలింపు ముమ్మరంగా సాగుతున్నదని తెలిపారు.  2003లో లేబర్‌ కాంట్రాక్ట్‌ బోర్డు చైర్మన్‌ సంతోష్‌ శుక్లాను వికాస్‌ దూబే హత్య చేసినట్టుగా ఆరోపణలున్నాయి. కానీ ఆ కేసు నుంచి అతడు నిర్దోషిగా విడుదలయ్యాడు. కాగా, గ్యాంగ్‌స్టర్‌ ముఠా చేతుల్లో 8 మంది పోలీసులు మరణించడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  


logo