సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 18:17:13

షాక్‌, రక్తస్రావంతోనే వికాస్‌ దూబే మృతి

షాక్‌, రక్తస్రావంతోనే వికాస్‌ దూబే మృతి

కాన్పూర్‌ : గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే షాక్‌తో పాటు బుల్లెట్‌ గాయాలకు రక్తస్రావం కావడంతో మరణించాడని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన పది రోజుల తర్వాత సోమవారం పోస్టుమార్టం నివేదిక విడుదలైంది. కాన్పూర్‌లోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిక్రూ గ్రామంలో దూబే జూలై 2, 3న ఎనిమిది మంది పోలీసుల దారుణ మారణకాండకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తుండగా, జూలై 9న ఉజ్జయినీ ఆలయంలో పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా మధ్యదారిలో ఆ వాహనం బోల్తా పడింది. ఆ క్రమంలో దూబే తప్పించుకుని పారిపోబోతూ పోలీసులపై కాల్పులు జరపడం, వారి ఎదురుకాల్పుల్లో ఆ కిల్లర్ గాయపడి మరణించడం తెలిసిందే.

అతని శరీరం గుండా మూడు బుల్లెట్‌ చొచ్చుకు వెళ్లాయని, అలాగే పది గాయాలు ఉన్నాయని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. మొదటి బుల్లెట్ అతని కుడి భుజానికి తగిలింది. మరో రెండు అతని ఛాతీకి ఎడమ వైపున తాకాయని పేర్కొన్నారు. శవపరీక్ష నివేదిక ప్రకారం అతని శరీరం  కుడి వైపు భాగంలో తల, మోచేయి, పక్కటెముక, పొట్టపై గాయాలుండగా, నివేదికలో కాల్పులు ఎంత దూరం నుంచి జరిగాయో పేర్కొనలేదు. కాగా, గ్యాంగ్‌స్టర్‌తో పోలీసులు, రాజకీయ నేతలకు సంబంధాలున్నాయని.. ఆ నిజాలు బయటపడతాయనే భయంతోనే ఎన్‌కౌంటర్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ ఎస్కే అగర్వాల్‌ నేతృత్వంలోని కమిషన్‌ నివేదిక సమర్పించేందుకు రెండు నెలల సమయం ఇచ్చింది.

కాగా, కాన్పూర్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారనే ఆరోపణలతో దూబే సహాయకులలో ఇద్దరు జయకాంత్ వాజ్‌పేయి, ప్రశాంత్ శుక్లాలను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ‘వికాస్ దూబే జూలై1న వాజ్‌పేయిని పిలిచాడని, ఆ తరువాత ఇద్దరు నిందితులు మరుసటి రోజు అతన్ని కలుసుకున్నారని, రూ.2లక్షలతో పాటు రివాల్వర్లు ఇచ్చారు. జూలై 3న జరిగిన సంఘటన తరువాత, కూడా మూడు వాహనాల్లో తప్పించుకోవడానికి సహాయం చేశారు. అయితే, పోలీసుల అప్రమత్తత కారణంగా, వారు జూలై 4న వాహనాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు’. అని పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.logo