ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 17:59:58

ఆగస్టు 15వ వరకు గంగ్రోతి ఆలయం మూసివేత

ఆగస్టు 15వ వరకు గంగ్రోతి ఆలయం మూసివేత

డెహ్రాడూన్‌ : చార్‌ధామ్‌ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన వేళ.. ఆగస్టు 15వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించినట్లు మంగళవారం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి పుణ్యక్షేత్రం అర్చకులు ప్రకటించారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల పొడవైన రోడ్డు వెంట భారీ కేడ్లు ఏర్పాటు చేసి భక్తులకు రాకుండా చూడడంతో పాటు ఆలయం మూసివేతకు సంబంధించిన వివరాలను పోస్టర్లపై ప్రదర్శించాలని అర్చక సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తరకాశీ జిల్లా మెజిస్ట్రేట్‌కు వినతిపత్రం ద్వారా సమాచారం అందించినట్లు గంగోత్రి ధామ్‌ ఆలయ కమిటీ చైర్మన్‌ సురేష్‌ సెమ్వాల్‌ పేర్కొన్నారు. రెండు కిలోమీటర్ల దారి వెంట అడ్డంకులను ఏర్పాటు చేస్తామని, ఎవరైనా ఆలయం వైపు వస్తే ప్రవేశాన్ని అడ్డుకుంటామని చెప్పారు.

ఈ ప్రాంతంలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సెమ్వాల్‌ చెప్పారు. షరతులతో చార్‌ధామ్‌ పుణ్య క్షేత్రాల సందర్శనకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులను అనుమతించాలని ఉత్తరాఖండ్‌ సర్కారు శుక్రవారం నిర్ణయించింది.  కొత్త మార్గదర్శకాల ప్రకారం.. యాత్రికులు తాజా ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు కలిగి (రాష్ట్రంలోకి ప్రవేశించిన 72 గంటల్లోగా నిర్వహిస్తారు) ఉండాలి. అలాగే రాష్ట్రంలోకి ప్రవేశించిన అనంతరం తప్పనిసరిగా క్వారంటైన్‌ పీరియడ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కరోనా పరీక్షలకు సంబంధించిన ఈ రిపోర్టులు చార్‌ధామ్‌ బోర్డు వెబ్‌సైట్‌లో సందర్శనకు అనుమతి తీసుకోవడానికి కూడా అవసరం. యాత్ర సమయంలోనూ డాక్యుమెంట్లన్నింటినీ వెంట ఉంచుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo