శుక్రవారం 03 జూలై 2020
National - Jul 01, 2020 , 15:50:05

గల్వాన్‌ యూనిట్‌కు.. సంతోష్‌ బాబు లాంటి సత్తా ఉన్న కొత్త కమాండర్‌

గల్వాన్‌ యూనిట్‌కు.. సంతోష్‌ బాబు లాంటి సత్తా ఉన్న కొత్త కమాండర్‌

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయ యూనిట్‌కు కొత్త సైనిక కమాండర్‌ను నియమించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 16 బీహార్‌ రెజిమెంట్‌కు చెందిన ఒక సైనిక అధికారిని ఇటీవల కర్నల్‌ ర్యాంకుకు ప్రొమోట్‌ చేశారు. ఆయన మరో బెటాలియన్‌కు కమాండర్‌గా వ్యవహరించాల్సి ఉన్నది. అయితే జూన్‌ 15న గల్వాన్‌ లోయ వద్ద జరిగిన భారత్‌, చైనా ఘర్షణలో 16 బీహార్‌ రెజిమెంట్‌కు చెందిన తెలంగాణవాసి కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అమరులైన వారిలో 12 మంది జవాన్లు 16 బీహార్‌ రెజిమెంట్‌కు చెందిన వారు కాగా, 12 బీహర్‌ రెజిమెంట్‌ నుంచి ఒకరు, ఆర్టిలరీ రెజిమెంట్‌ నుంచి ముగ్గురు, మౌంటైన్‌ సిగ్నల్స్‌ యూనిట్‌ నుంచి ఒకరు ఉన్నారు. 

చైనా సైనికులతో జరిగిన ముఖాముఖి ఘర్షణలో 16 బీహార్‌ రెజిమెంట్‌కు చెందిన భారతీయ సైనికులు ఎనలేని ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన సుమారు 40-45 మంది సైనికులు కూడా మరణించి ఉంటారని తెలుస్తున్నది. అయితే దీనిపై చైనా నోరు విప్పడం లేదు. 45 ఏండ్ల అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన అతి పెద్ద ఘర్షణలో కీలక పాత్ర పోషించిన 16 బీహార్‌ రెజిమెంట్‌ సైనికుల మనోస్థైర్యాన్ని మరింతగా పెంచే ఉద్దేశంతో ఆ రెజిమెంట్‌కు చెందిన అధికారిని గల్వాన్‌ లోయ యూనిట్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా పంపాలని ఆర్మీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘కరమ్‌ హి ధరమ్‌’ అన్న ఆ యూనిట్‌ నినాదాన్ని రుజువుచేసిన సంతోష్‌ బాబు లాంటి సత్తా ఉన్న ఒక సైనిక అధికారిని ఇటీవల కర్నల్‌ ర్యాంకుకు ప్రొమోట్‌ చేసింది. ఈ పదోన్నతి పొందిన ఆ ఆర్మీ అధికారికి గల్వాన్‌ లోయ యూనిట్‌ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘర్షణలో గాయపడిన 16 బీహార్‌ రెజిమెంట్‌కు చెందిన పలువురు సైనికులు లేహ్‌లోని ఆర్మీ దవాఖానలో చికిత్స అనంతరం తిరిగి గల్వాన్‌ లోయ యూనిట్‌కు హాజరైనట్లు తెలుస్తున్నది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo