శనివారం 04 జూలై 2020
National - Jun 28, 2020 , 13:33:23

జూలై 5 నుంచి ఆదివారం పూర్తిగా లాక్‌డౌన్‌

జూలై 5 నుంచి ఆదివారం పూర్తిగా లాక్‌డౌన్‌

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా తీవ్రత బాగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.  జూలై 5 నుంచి  ప్రతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించింది. ఇప్పటి వరకు రాత్రి 9 గంటల నుంచి రాత్రిపూట కర్ఫ్యూను పాటిస్తుండగా దీన్ని ఒక గంట ముందుకు కుదించారు. ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవుగా ప్రకటించారు. దీంతో వారంలో ఐదు రోజులు మాత్రమే అవి పని చేస్తాయి. 

ఆదివారం నాటికి కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 11,923కు, మరణాలు 191కి చేరాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు దవాఖానలో పడకల అందుబాటు కోసం ఒక వ్యవస్థను రూపొందించాలని సీఎం యెడియూరప్ప అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల కోసం మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాళ్లు, హాస్టల్స్‌, ఇతర సంస్థలతోపాటు రైల్వే కోచ్‌లను వినియోగించాలని సూచించారు. బెంగళూరులో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండటంతో కరోనా సోకిన వారిని దవాఖానలకు తరలించేందుకు 250 ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. మరోవైపు కేంద్రం 15 వైద్య బృందాలను కర్ణాటకకు పంపింది. 


logo