గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 17:26:31

కరోనా ఎఫెక్ట్ తో నాటు కోడికి మస్త్ డిమాండ్...

కరోనా ఎఫెక్ట్ తో నాటు కోడికి మస్త్ డిమాండ్...

హైదరాబాద్ : కరోనా బారీ నుంచి మహా నగరాలే కాదు... చిన్న పట్టణాలకు విస్తరించింది. నగరాల్లో ఉంటే వైరస్ బారిన పడుతామన్న ఆందోళనలతో ప్రజలుగ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారుతున్నది. పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు మాత్రమే కాదు... మన జీవన విధానానికి అవి ఆదర్శప్రాయ ప్రాంతాలని మరోసారి రుజువు అవుతున్నది. ఎందుకంటే అక్కడి ప్రజల ఆహార వ్యవహారాలు దానిని స్పష్టం చేస్తున్నాయి. పట్టణాల్లో దొరికే బ్రాయిలర్ కోడి మాంసం (చికెన్) కంటే పల్లెటూళ్ళ లో లభించే నాటు కోడి లో పోషకాలు ఎక్కువని ప్రజలు విశ్వసిస్తున్నారు. రుచితో పాటు అందులో ప్రోటీన్ అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.

అందుకే ప్రస్తుతం ప్రజలు నాటు కోడి మాంసం తినేందుకు ఎగబడుతున్నారు. గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఎలాగూ అవి లభిస్తాయి కాబట్టి ప్రాబ్లెమ్ లేదు. కానీ నగరాలూ, పట్టణాల్లో కూడా నాటు కోడి మాంసం తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా నాటుకోడి కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి చికెన్ సెంటర్ లోనూ ఇప్పుడు నాటు కోడి మాంసం విక్రయిస్తున్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో పాటు సప్లై తక్కువగా ఉండటంతో ధర విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో నాటు కోడి కూర రూ 500 పలుకుతున్నది. ఈ ధరకు సాధారణ చికెన్ రెండు కిలోల కంటే ఎక్కువ లభించటం గమనార్హం. కరోనా వైరస్ సోకితే పుష్టిగా ఆహారం తీసుకుని, ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవటం మాత్రమే సరైన విధానం అని డాక్టర్లు సూచిస్తున్నారు.

శరీరంలో వైరస్ తో పోరాడేందుకు తగిన శక్తిని కూడగట్టుకోవటమే మనముందున్న మార్గం. అందుకే వైరస్ సోకిన వారితో పాటు ముందు జాగ్రత్తలో భాగంగా మిగితా ప్రజలు కూడా పౌష్టికాహారం పై దృష్టిసారిస్తున్నారు. దీంతో చికెన్ కు అందులోనూ నాటు కోడి సహా సరికొత్త చికెన్ కు డిమాండ్ పెరుగుతున్నది. మధ్య ప్రదేశ్ లో లభించే మేలు జాతి కోడి (కడకనాథ్) చికెన్ కు కూడా డిమాండ్ ఊపందు కున్నది. పూర్తి నల్లగా ఉండే ఈ కోడి మాంసం కూడా కాస్త నల్లగానే ఉంటుంది. కానీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని ప్రజల విశ్వాసం. అందుకే దీనికి ధర మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో రూ. 800 వరకు ఉండడం విశేషం.


logo