శనివారం 29 ఫిబ్రవరి 2020
14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి.. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు..

14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి.. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు..

Feb 15, 2020 , 11:26:43
PRINT
14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి.. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు..

బెంగళూరు : ఓ వ్యక్తి 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు.. అయినప్పటికీ తన సంకల్పాన్ని వదులుకోలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత తనకిష్టమైన వైద్యవిద్యను పూర్తి చేసి డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కర్ణాటకలోని కలాబురాగికి చెందిన సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి 1997లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాడు. 2002లో తన ప్రియురాలి భర్తను చంపి జైలు పాలయ్యాడు. ప్రియురాలు పద్మావతి కూడా భర్త అశోక్‌ గుత్తేదార్‌ హత్యలో కీలకపాత్ర పోషించింది. మొత్తానికి సుభాష్‌ పాటిల్‌, పద్మావతికి జైలు శిక్ష పడింది. పాటిల్‌ 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత సత్పవర్తన కింద 2016లో ఆయనను విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన సుభాష్‌ పాటిల్‌.. తాను కలలు కన్న వైద్య విద్యను పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు. దీంతో పాటిల్‌ 2019 ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. ఇటీవలే ఆయన ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తయింది. ఇప్పుడు కర్ణాటకలో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు సుభాష్‌ పాటిల్‌. జైల్లో ఉన్న సమయంలోనే పాటిల్‌.. ఎంఏ జర్నలిజం చేశాడు. అంతేకాకుండా సెంట్రల్‌ జైలు ఆస్పత్రిలో వైద్యులకు సహాయకుడిగా ఉండేవాడు పాటిల్‌. 

పాటిల్‌, పద్మావతి మధ్య ప్రేమ ఇలా..

కలాబురాగి జిల్లాలోని ఎంఆర్‌ మెడికల్‌ కాలేజీలో పాటిల్‌ ఎంబీబీఎస్‌ చేస్తున్నాడు. అయితే అతను పద్మావతి ఇంటి పక్కనే నివసిస్తుండేవాడు. ఈ క్రమంలో పద్మావతి, పాటిల్‌ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే పద్మావతికి, అశోక్‌కు వివాహమైంది. అయినప్పటికీ పాటిల్‌తో పద్మావతి చనువుగా ఉంటూ.. శారీరకంగా దగ్గరైంది. విషయం తెలుసుకున్న అశోక్‌.. తన భార్యతో పాటు పాటిల్‌ను మందలించాడు. తన భార్య వద్దకు వస్తే చంపేస్తానని సుభాష్‌ను బెదిరించాడు అశోక్‌. చివరకు అశోక్‌నే పాటిల్‌, పద్మావతి కలిసి మట్టుబెట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో పాటిల్‌.. ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ కేసులో పద్మావతిని, పాటిల్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే 2016, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్పవర్తన కింద పాటిల్‌ను జైలు నుంచి విడుదల చేశారు అధికారులు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైనెన్స్‌ నుంచి అనుమతి తీసుకుని తన ఎంబీబీఎస్‌ విద్యను పూర్తి చేశాడు పాటిల్‌. 


logo