శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 03:37:12

మార్చి 3న ఉరి!

మార్చి 3న ఉరి!
  • నిర్భయ దోషులకు తాజా డెత్‌ వారంట్‌ జారీ
  • క్యురేటివ్‌ పిటిషన్‌ వేస్తానన్న పవన్‌,
  • నిరాహారదీక్షకు దిగిన వినయ్‌,
  • చట్టపరమైన అవకాశాల వినియోగానికి ముగిసిన గడువు
  • శిక్ష అమలు వాయిదాకు దోషుల కొత్త ఎత్తులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష అమలుచేసేందుకు కోర్టు తాజాగా మరోమారు డెత్‌ వారంట్‌ జారీచేసింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా సోమవారం పేర్కొన్నారు. దోషులు ముఖేశ్‌కుమార్‌సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ (31)పై కోర్టు డెత్‌ వారంట్‌ జారీచేయడం ఇది మూడోసారి. శిక్షను వాయిదా వేయించేందుకు దోషులు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో ఒక కొత్త పిటిషన్‌ దాఖలు చేస్తుండటంతో శిక్ష అమలు వాయిదా పడుతూ వస్తున్నది.  


దోషులకు డెత్‌ వారంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్లపై ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దోషుల్లో ఒకడైన ముఖేశ్‌.. తన తరఫున న్యాయవాది వృందా గ్రోవర్‌ వాదించరాదని చెప్పాడు. దీంతో న్యాయస్థానం న్యాయవాది రవి ఖాజీని నియమించింది. మరో దోషి వినయ్‌ తీహార్‌ జైలులో నిరాహారదీక్ష చేస్తున్నాడని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జైలులో వినయ్‌పై దాడి జరిగిందని, తలకు గాయమైందని, దీంతో అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. అందువల్ల అతనికి మరణశిక్షను అమలు చేయరాదని అన్నారు. ఈ నేపథ్యంలో వినయ్‌ విషయంలో చట్టం ప్రకారం వ్యవహరించాలని తీహార్‌ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. ఇక పవన్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌, రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. నలుగురు దోషుల్లో పవన్‌ మాత్రమే ఇంతవరకు క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరలేదు. రాష్ట్రపతిని తాము మరోసారి క్షమాభిక్ష కోరనున్నామని అక్షయ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 


ముగిసిన గడువు

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువు ముగిసిందని, దోషులకు సంబంధించి ఎటువంటి పిటిషన్‌ ఏ కోర్టులోనూ పెండింగ్‌లో లేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ మోహన్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు మార్చి 3న నలుగురిని ఉరితీయాలని తాజా డెత్‌ వారంట్లు జారీ చేసింది. 


ఈసారైనా ఉరితీస్తారని నమ్ముతున్నాం:నిర్భయ తల్లిదండ్రుల ఆశాభావం

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులను వచ్చే నెల 3న ఉరితీయాలంటూ ఢిల్లీలోని స్థానిక కోర్టు డెత్‌వారెంట్‌ జారీ చేయడంపై నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. దోషులను ఈ సారైనా ఉరితీస్తారన్న నమ్మకం తమకు ఉన్నదన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ ఉరిశిక్షపై మళ్లీ ఎలాంటి పిటిషన్లు దాఖలైనా వాటిని కోర్టు అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. నిర్భయ తండ్రి బద్రినాథ్‌ సింగ్‌ స్పందిస్తూ డెత్‌ వారెంట్‌ జారీ కావడంపై సంతోషంగా ఉన్నదని, అయినా దోషులను ఉరితీసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.


logo