శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 14:50:16

కరోనా రోగులకు ఉచితంగా వైద్యసేవలు: డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి

కరోనా రోగులకు ఉచితంగా వైద్యసేవలు: డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ కొవిడ్ 19 దవాఖానలో కరోనా రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తామని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ జీ సతీశ్ రెడ్డి తెలిపారు. ఆర్మీకి చెందిన వైద్యులు, నర్సులు, సిబ్బంది 24 గంటలపాటు కరోనా రోగులకు వైద్య సేవలందిస్తారని ఆయన చెప్పారు. ఢిల్లీ కంటోన్‌మెంట్ ప్రాంతంలోని డంపింగ్ యార్డును చదును చేసి కేవలం 12 రోజుల్లో వెయ్యి పడకల తాత్కాలిక కరోనా దవాఖానను ఏర్పాటు చేసినట్లు సతీశ్ రెడ్డి వివరించారు. కేంద్ర హోంశాఖ, టాటా సన్స్, ఇతర సంస్థల సహకారంతో రికార్డు సమయంలో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఈ తాత్కాలిక దవాఖానను నిర్మించామని తెలిపారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా రోగులకు వైద్య చికిత్స అందజేసేందుకు డీఆర్డీవో దవాఖానలో ఆధునాతన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచినట్లు చైర్మన్ సతీశ్ రెడ్డి తెలిపారు. ఇందులో 250కిపైగా ఐసీయూ వార్డులున్నాయని చెప్పారు. లఢక్ సరిహద్దులోని గల్వాన్ లోయ వద్ద జూన్ 15న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది వీర జవాన్ల గౌరవార్ధం వారి పేర్లను ఈ దవాఖాన వార్డులకు పెట్టినట్లు ఆయన వివరించారు.  మరోవైపు ప్రస్తుతం ఆర్మీకి చెందిన 600 మంది డీఆర్డీవో దవాఖానలో వైద్య సేవలందిస్తారని లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురి కనిత్కార్ చెప్పారు. ఇందులో ఆర్మీ వైద్యులు, నర్సులతోపాటు పలువురు సిబ్బంది ఉన్నట్లు ఆమె చెప్పారు. కరోనా రోగుల సంఖ్యనుబట్టి వీరి సంఖ్యను పెంచుతామని వెల్లడించారు.
 


logo