శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 16:59:27

వ‌ల‌స‌కూలీల‌ను తీసుకెళ్ల‌కండి.. యోగిని వేడుకున్న సీఎంలు

వ‌ల‌స‌కూలీల‌ను తీసుకెళ్ల‌కండి.. యోగిని వేడుకున్న సీఎంలు

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వ‌ల్ల వ‌ల‌స‌కూలీలు స్వంత రాష్ట్రాల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం యూపీ, బీహార్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన పేద‌లే ఎక్కువ‌శాతం వివిధ రాష్ట్రాల్లో వ‌ల‌స కూలీలుగా ప‌నిచేస్తున్నారు.  అయితే క‌రోనాతో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల వాళ్లంతా ఉపాధి కోల్పోయారు. దిక్కుతోచ‌ని స్థితిలో ఇప్పుడు స్వంత రాష్ట్రాల‌కు వ‌ల‌స కూలీలు బాట‌క‌ట్టారు. కానీ ఇది ఆయా రాష్ట్రాల‌కు ప్ర‌మాద‌క‌రంగా మారింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత ఒక్క‌సారిగా ఆర్థిక స్తంభ‌న ఏర్ప‌డుతుంది. ఇక అనేక ఫ్యాక్ట‌రీలు, భ‌వ‌ణ నిర్మాణాల్లో ప‌నిచేస్తున్న వ‌ల‌స కార్మికులు లేక‌పోవ‌డంతో.. ఆర్థిక ప్ర‌గ‌తి ఆగిపోయే ప్ర‌మాదం ఉంది.  దీంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ను‌.. కూలీల‌ను తీసుకువెళ్ల‌కండి అంటూ కొన్ని రాష్ట్రాలు సీఎంలు వేడుకున్నారు. 

పంజాబ్, క‌ర్నాట‌క‌, హ‌ర్యానా, గుజ‌రాత్ రాష్ట్రాల సీఎంలు ఇవాళ యూపీ సీఎం యోగితో ఫోన్‌లో మాట్లాడారు.  ఆ న‌లుగురు సీఎంలు వ‌ల‌స కూలీల‌ను ఒక్క‌సారిగా తీసుకువెళ్ల‌కూడ‌దంటూ కోరుకున్నారు. కూలీలంతా ఒక్క‌సారే వెళ్లిపోతే అప్పుడు ప‌నుల‌న్నీ స్తంభించిపోతాయ‌ని ఆయా రాష్ట్రాలు సీఎంలు యోగికి తెలియ‌జేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవాల‌న్న ఉద్దేశంతో సీఎం యోగి.. ఇప్ప‌టికే ఆరున్న‌ర ల‌క్ష‌ల మంది వ‌ల‌స కూలీల‌ను వివిధ రాష్ట్రాల నుంచి వెన‌క్కి ర‌ప్పించుకున్నారు. ఈ నేప‌థ్యంలో స‌మ‌స్య తీవ్ర‌త‌ను గుర్తించిన కొంద‌రు సీఎంలు.. కూలీల‌ను వెన‌క్కి తీసుకువెళ్ల‌వ‌ద్దు అంటూ యోగిని కోరుకుంటున్నారు.

 


logo