శుక్రవారం 03 జూలై 2020
National - Jan 08, 2020 , 11:15:37

భగ్గుమనిపించిన దారుణం

భగ్గుమనిపించిన దారుణం

2013లో మరణశిక్ష ప్రకటించిన కోర్టు.. ఏడేండ్ల తర్వాత డెత్‌ వారంట్‌ జారీ
న్యూఢిల్లీ: దేశమంతా భగ్గుమన్న దారుణం ‘నిర్భయ’ ఘటన. ఈ కేసుపై ఏడేండ్లుగా వివిధ న్యాయస్థానాల్లో వాదప్రతివాదనలు జరుగుతూ వచ్చాయి. ఆ నేపథ్యం ఏమిటంటే.. 2012 డిసెంబర్‌ 16వ తేదీన ఢిల్లీలోని ఒక బస్సులో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న 23 ఏండ్ల పారా మెడికల్‌ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా లైంగిక దాడి జరిపి, బస్సు నుంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం అదేరోజు సఫ్దర్‌జంగ్‌ దవాఖానలో చేర్చారు. ఈ దారుణ ఘటనపై మరునాడే దేశమంతా భగ్గుమన్నది. నిందితులు బస్సు డ్రైవర్‌ రాంసింగ్‌, అతడి సోదరుడు ముఖేశ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తాలను గుర్తించిన పోలీసులు.. 18న అరెస్ట్‌ చేశారు. 21న నిందితుల్లోని బాల నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆరో నిందితుడు అక్షయ్‌ ఠాకూర్‌ను బీహార్‌లోని ఔరంగాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. మరోవైపు దవాఖానలో సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్డీఎం) ముందు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చారు. లైంగికదాడి ఘటనలో బాధితురాలు చివరివరకు నిందితులను ప్రతిఘటించిందని తెలుసుకున్న ప్రజలు.


బాధితురాలికి ‘నిర్భయ’ అనే పేరు పెట్టడంతో ఆ పేరే స్థిరపడింది. చివరకు పోలీసులు అదే పేరుతోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 26న నిర్భయను మెరుగైన చికిత్స కోసం కేంద్రప్రభుత్వం సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ దవాఖానకు తరలించింది. కానీ 29న నిర్భయ మరణించడంతో నిందితులపై హత్యానేరం నమోదైంది. 2013 జనవరి రెండో తేదీన నాటి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అల్తమస్‌ కబీర్‌ లైంగిక దాడుల కేసులను త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు(ఎఫ్‌టీసీ)ని ప్రారంభించారు. జనవరి 17న ఎఫ్‌టీసీలో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మార్చి 11న బస్సు డ్రైవర్‌ రాంసింగ్‌ తీహార్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 31న బాల నేరస్థుడిని దోషిగా నిర్ధారించిన జువైనల్‌ జస్టిస్‌ బోర్డు (జేజేబీ) మూడేండ్ల జువైనల్‌ హోంశిక్ష విధించింది. సెప్టెంబర్‌ 13న నలుగురు దోషులకు ఎఫ్‌టీసీ మరణశిక్ష విధించింది. 2014 మార్చి 13న ఎఫ్‌టీసీ తీర్పును ఢిల్లీ హైకోర్టు., 2017 మే 5న సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది ‘అరుదైన కేసు’ విభాగంలోకి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముఖేశ్‌, వినయ్‌శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన సమీక్షా పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది తాజాగా ఈ నెల 22న ఉదయం ఏడు గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని తీహార్‌ జైలు అధికారులను మంగళవారం ఢిల్లీ కోర్టు ఆదేశించింది.


logo