శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 14, 2020 , 02:16:44

పర్యావరణవేత్త ఆర్కే పచౌరీ కన్నుమూత

పర్యావరణవేత్త  ఆర్కే పచౌరీ కన్నుమూత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రముఖ పర్యావరణవేత్త ఆర్కే పచౌరీ గురువారం సాయంత్రం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏండ్లు. పచౌరీ దీర్ఘకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్నారని, ఇటీవలే ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్యం మరింత విషమించడంతో మంగళవారం ఢిల్లీలోని ఎస్కార్ట్స్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంధన, వనరుల సంస్థ (టెరీ)కి పచౌరీ వ్యవస్థాపక చైర్మన్‌గా పనిచేశారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వాల ప్రతినిధుల సంస్థకు పచౌరీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే నోబెల్‌ బహుమతి లభించింది. ఆయన సాహసోపేతమైన నాయకత్వం కారణంగానే ప్రపంచ దేశాలు వాతావరణ మార్పుల అంశాన్ని ఒక కీలకమైన సమస్యగా గుర్తించాయని పచౌరీ కుటుంబం తెలిపింది. పచౌరీ మృతి పట్ల టెరీ సంస్థ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. 2015లో పచౌరీపై టెరీలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి.. లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ సంస్థ నుంచి వెళ్లిపోయారు. పచౌరీని కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మభూషణ్‌తో, 2008లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.


 


logo