శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 03, 2020 , 20:33:36

బ్యాంకుల ప్రయివేటీకరణ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

బ్యాంకుల ప్రయివేటీకరణ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకులను ఒకేసారి ప్రయివేటీకరించకపోయినప్పటికీ, ప్రయోగాత్మకంగా ఒకటి రెండింటిని ప్రయివేటీకరించి చూడాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ తమల్ బందోపాధ్యాయ రచించిన 'పాండెమోనియం: ది గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజెడీ' త్వరలో విడుదల కానుంది. ఈ పుస్తకంలో మాజీ గవర్నర్లు రఘురాం రాజన్, వైవీ రెడ్డి, దువ్వూరి సుబ్బారావు, సీ రంగరాజన్ హెచ్చరికలు జారీ చేశారు.

కంపెనీలు అవసరానికి మించిపెట్టిన పెట్టుబడులు, ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడంలో బ్యాంకులు ప్రదర్శించిన అత్యుత్సాహం, సత్వర స్పందన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఎన్పీఏ సమస్య పెరగడానికి మూల కారణాలని రఘురాం రాజన్ అన్నారు. దేశీయ బ్యాంకుల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ)లు ఏ దేశంలోను లేనంత భారీస్థాయికి పెరిగాయన్నారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు బ్యాంకుల నిరర్థక ఆస్తులతో ముప్పు పొంచి ఉందన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ఒకేసారి కాకపోయినా ప్రయోగాత్మకంగా ఒకటి రెండింటిని ప్రయివేటీకరించి చూడాలన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ జోక్యమే పెద్దసమస్య అన్నారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంతో సమస్య పరిష్కారం కాదని, ప్రధాన సమస్య పాలనాపరమైన లోపాలు అని వైవీ రెడ్డి అన్నారు. ప్రభుత్వం క్రమంగా తప్పకుండా మూలధనాన్ని సమకూర్చుతున్నప్పటికీ, ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మార్కెట్ వాటాను కోల్పోతున్నాయన్నారు. ఇలాగే ఉంటే కొంతకాలానికి బ్యాంకింగ్ రంగంలో విదేశీ సంస్థలు అధిక వాటాదారులుగా ఉన్న ప్రయివేటు బ్యాంకుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం బ్యాంకుల మూలధనం కోసం ప్రజాధనాన్ని వినియోగించాల్సి వస్తున్నదన్నారు. ప్రభుత్వ అజమాయిషీలో కొన్ని బ్యాంకులు ఉంటే సరిపోతుందని, ఎన్ని బ్యాంకులు ఉండాలనే అంశం ప్రభుత్వం ఆర్థిక సత్తా పైన ఆధారపడి ఉంటుందని డాక్టర్ రంగరాజన్ అన్నారు. ఎస్బీఐ ప్రభుత్వ బ్యాంకుగా ఉండాలని, ఇది కాక మరిన్ని ప్రభుత్వ బ్యాంకులు ఉంటే చాలని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.