మంగళవారం 19 జనవరి 2021
National - Dec 23, 2020 , 15:58:11

మూడేళ్లుగా క‌రెంటు, నీళ్ల బిల్లు క‌ట్ట‌ని మాజీ ప్రొఫెస‌ర్‌

మూడేళ్లుగా క‌రెంటు, నీళ్ల బిల్లు క‌ట్ట‌ని మాజీ ప్రొఫెస‌ర్‌

డెహాడ్రూన్ : విద్యుత్ లేని జీవితాన్ని మ‌నం ఊహించ‌గ‌లమా? పర్యావరణవేత్త, డెహ్రాడూన్ నివాసి సౌమ్య ప్రసాద్ మాత్రం గ‌త‌ మూడేళ్లుగా అదే బాట‌లో ప‌య‌నిస్తున్నారు. మూడు సంవ‌త్స‌రాలుగా ఆమె క‌రెంట్‌, వాట‌ర్ బిల్లులు ఒక్క పైసా కూడా చెల్లించ‌లేదు. స‌న్యాసి జీవితం గ‌డుపుతున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు ఆమె సంఘ జీవ‌నాన్నే గ‌డుపుతున్నారు. కారుతో పాటు ఆధునిక జీవన సౌకర్యాలను ఆమె వినియోగిస్తున్నారు. కాక‌పోతే అవ‌న్నీ సాధ్యమైనంత తక్కువ కార్బన్ ఉద్గారాల‌ను వెలువ‌రించేవిగా అదేవిధంగా ప‌ర్యావ‌ర‌ణహితంగా ఉండేలా చూసుకుంటుంది. 

గ‌త కొన్నేళ్లుగా ప్రసాద్ తన దైనందిన జీవితంలో పర్యావరణ అనుకూల పద్ధతులను పెంపొందించుకుంటున్నారు. వ్య‌క్తిగ‌త అదేవిధంగా కుటుంబ అవసరాలను తీర్చేందుకు సౌర విద్యుత్తుతో పాటు వర్షపునీటిని ఒడిసిప‌ట్టి వినియోగించుకుంటున్నారు. త‌మ నివాసాన్ని పర్యావరణ అనుకూలమైన ఇంటిగా మార్చేందుకు ఆమె ఈ ప‌ద్ద‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. ఫ‌లితంగా ఆమెకు వేలాది నీటి, విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి. మ‌రోప‌క్క ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో స‌హాయం చేస్తుంది. 

సౌమ్య‌ ప్ర‌సాద్‌ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పర్యావరణశాస్త్ర ఉపాధ్యాయురాలిగా ప‌నిచేసేవారు. జంతువులతో పాటు జీవావరణ శాస్త్రంపై చెత్త ప్రభావం గురించి అధ్యయనం చేస్తున్నారు. 2015 లో త‌మ క‌ల‌ల సౌధాన్ని నిర్మించుకునేందుకు భ‌ర్త‌తో క‌లిసి డెహ్రాడూన్‌కు వెళ్లారు. కలపతో చేసిన కొత్త ఇంటిని కొనడానికి బదులుగా ఈ జంట వెదురుతో ఒక ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ మేర‌కు నిర్మాణ సమయంలో ఏది వృథా కాకుండా చూసుకున్నారు. నీరు, విద్యుత్ అవ‌స‌రాల కోసం సొంతంగా రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ సిస్టంను అదేవిధంగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్ర‌యాణానికి వినియోగించే పెట్రోల్ కారును సైతం తీసేసి ఎల‌క్ట్రిక‌ల్ కారును కొన్నారు. పెర‌డులో సొంతంగా కూర‌గాయ‌ల‌ను పండించుకుంటూ తింటున్నారు. 

పుట్టబోయే పిల్లల మావిలో మైక్రోప్లాస్టిక్స్ కనుగొనబడుతున్న ఈ రోజుల్లో సౌమ్య ప్రసాద్ ప‌ర్యావ‌ర‌ణ అనుకూల జీవ‌న‌శైలి భవిష్యత్ తరాలకు ఆద‌ర్శంగా నిలుస్తోంది. మ‌న పూర్వీకుల నుండి వార‌స‌త్వంగా పొందిన భూమిని అంతే సార‌వంతంతో భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించ‌వ‌చ్చు.