మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 27, 2020 , 15:28:19

నేడు జేడీ(యూ)లోకి బీహార్‌ మాజీ పోలీస్‌ బాస్‌

నేడు జేడీ(యూ)లోకి బీహార్‌ మాజీ పోలీస్‌ బాస్‌

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు  ముందే ఆ రాష్ట్ర మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ఆదివారం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ (యునైటెడ్‌)లో చేరనున్నారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుకు సంబంధించిన వివాదంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన బీహార్‌ డీజీపీ నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అధికార పార్టీలో చేరుతారా?లేదా? అన్న చర్చ జోరుగా సాగగా.. ఎట్టకేలకు ఆయన సీఎం సమక్షంలో ఆదివారం ఆ పార్టీ తీర్థం స్వీకరించనున్నారు. శనివారం పాండే సీఎం నితీశ్‌ కుమార్‌ను పార్టీ కార్యాలయంలో కలిసి 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. దీంతో పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరగ్గా.. ఆ వార్తలను ఆయన ఖండించారు.

లోక్‌సభ ఉప ఎన్నికల్లో బరిలోకి..?

ఆయనను లోక్‌సభ ఉప ఎన్నికల్లో బక్సర్‌, వాల్మీకినగర్‌ లోక్‌సభ నుంచి జేడీ(యూ) ఆయనను బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నితీశ్‌ పార్టీకి యాదవ్‌ కాని ఓబీసీలు, పాస్మండా ముస్లింలు ఎక్కువగా మద్దతునిస్తున్నారు. పాండే చేరికతో బ్రాహ్మణుల మద్దతు సైతం కూడగట్టగలదని ఆ పార్టీ భావిస్తోంది. గుప్తేశ్వర్ పాండే సీఎం మద్దతుదారుడిగా, నటి రియా చక్రవర్తిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు. పాండే 2009లోనే ఉద్యోగానికి రాజీనామా చేయగా.. అప్పటి ప్రభుత్వం ఆయన రాజీనామాను అంగీకరించలేదు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి గుప్తేశ్వర్‌ పాండే. ఆయన ఈ నెల 22న తన ఉద్యోగానికి రాజీనామా చేయగా.. గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. ఇదిలా ఉండగా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఈసీ శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 28, నవంబర్ 3న, 7న మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.